కార్మికుల సమస్యలు వినేందుకు, కార్మిక సంఘాలతో చర్చించేందుకు ప్రతి సంవత్సరం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్సీ) ప్రతి ఆరు మాసాలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతి బడ్జెట్ సమావేశాల ముందు ఐఎల్సీ సమావేశాన్ని కేంద్ర కార్మికశాఖ అధ్యక్షతన జరిపి కార్మిక సంఘాల డిమాండ్లపై చర్చించేవారు. 2015 నుంచి ఆ సంఘాలతో సమావేశాలు కూడా నిర్వహించడంలేదు.
ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 10 ప్రధాన డిమాండ్లతో మెమోరాండం ఇస్తూ దశలవారీగా ఆందోళన, దేశవ్యాప్తంగా ఎనిమిదిసార్లు కార్మిక సంఘాలు సమ్మెలు నిర్వహించడం జరిగింది. 2015-, 2016లో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలు, 2017 నవంబర్ 9, 10, 11 తేదీలలో లక్షలాదిమంది కార్మికులతో పార్లమెంటు స్ట్రీట్ ఢిల్లీలో మహా పడావ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2019 ఎన్నికల ముందు జనవరి 8, 9 తేదీలలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో 10 కోట్లకు పైగా కార్మికులు పాల్గొన్నారు. 2019లో రెండవసారి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలకు తలొగ్గింది. వేతనాలకు సంబంధించిన చట్టాలను నాలుగింటిని విలీనం చేసి, అదేవిధంగా 49 చట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మికులకు నష్టం జరిగే రీతిలో చేసింది. మేక్ ఇన్ ఇండియా నినాదాలతో హైర్ & ఫైర్ ( వాడుకుని వదిలేసే ) పద్ధతిలో శ్రమజీవులను బానిసలుగా మార్చే నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటులో తమకున్న మందబలంతో కార్మిక చట్టాలలో సమూలంగా మార్పులు చేయడానికి నిర్ణయించి, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సభలో లేని సమయంలో కొత్త లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టి కనీసం చర్చలు లేకుండా ఏకపక్షంగా ఆమోదించింది.
కార్మిక సంఘాలపై పదేండ్లుగా దాడి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 'సంకల్ప పత్ర్’ పేరుతో మేనిఫెస్టోను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇందులో దేశ సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్న 47 కోట్ల శ్రామిక వర్గ హక్కుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను ప్రకటించలేదు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదికలో ఉన్న పది జాతీయ కార్మిక సంఘాలు మాత్రం మోదీ ప్రభుత్వం దేశంలో ఆధునిక బానిసత్వాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని (పీసీటీయూ) స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కార్మిక సంఘాలపై దాడులు చేస్తూనే ఉందని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఎస్ఐడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఏపీఎఫ్, యూటీయూసీలు ఈ ఐక్యవేదికలో సభ్యులుగా ఉన్నాయి. వీటితోపాటు స్వతంత్ర సంఘాలు, సమాఖ్యలు కూడా సభ్యులుగా ఉన్నాయి. కార్మికులను దిగజార్చేందుకు, వారి సామాజిక భద్రతను దెబ్బతీసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నందువల్లనే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పీసీటియూ చెబుతున్నది.
మోదీ హటావో.. దేశ్ కో బచావో
దేశంలో మొదటిసారిగా రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చాతో కూడా కేంద్ర కార్మిక సంఘాలు మమేకమయ్యాయి. మోదీ పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకుంటున్నామని ప్రకటించినప్పటికీ వాటినే కొనసాగించటాన్ని రైతు సంఘాల వేదిక, కార్మికులు, కర్షకులు సంయుక్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తున్నారు. ఇటీవలనే అంటే ఫిబ్రవరి 16వ తేదీన పీసీటీయూ- ఎస్కేఎంలు సమష్టిగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జి చేసి కార్మికులను, కర్షకులను అణచివేసేందుకు ప్రయత్నించింది. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోనికి వచ్చేందుకు.. మోదీ గ్యారంటీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. వికసిత భారత్, రామరాజ్యం అని భ్రమలు సృష్టించి, ధరల పెరుగుదల, నిరుద్యోగం మొదలైన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తటస్థం చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలతో విసిగి వేసారి పోయిన కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో ‘మోదీ హటావో ..దేశ్ కో బచావో’ పిలుపు నిచ్చాయి.
పీసీటీయూ ఆధ్వర్యంలో పోరాటం
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో పదేండ్లుగా విసిగి వేసారిపోయిన కార్మిక సంఘాలు తాడో పేడో తేల్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. జాతీయస్థాయిలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక( పీసీటీయూ)గా ఆవిర్బవించి ఉమ్మడి పోరాటం చేస్తున్నాయి. ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరిస్తూ పలు కార్యక్రమాలు చేస్తున్నాయి. భారతీయ మజ్డూర్ సంఘం మాత్రం బీజేపీకి అనుకూలగా వ్యవహరిస్తోంది. ఒకవేళ బీజేపీ మూడోసారి అధికారంలోనికి వస్తే ఇక మరిన్ని కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు, చట్టాలను అమలులోనికి తెస్తుందని కార్మిక సంఘాల ఐక్యవేదిక దృఢంగా విశ్వసిస్తోంది. దేశంలోని కార్మిక సంఘాలకు 'చావో,- బతుకో ' తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ 18వ లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. మోదీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న హక్కులను హరించి వేస్తోంది. వారికి ఉన్న ఒకే ఒక ఆయుధం పోరాటం. దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను నామరూపాలు లేకుండా చేసేందుకు, కార్మిక సంఘాలను నామమాత్రంగా మార్చి వేయడమే మోదీ తెచ్చిన లేబర్ కోడ్స్ ప్రధాన ఉద్దేశం.
- ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ, రాష్ట్ర సీనియర్ నాయకుడు