ఈ నెల నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు : ఐఎండీ

ఈ నెల నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు : ఐఎండీ
  • నైట్ టెంపరేచర్లూ ఎక్కువే నమోదవుతయ్: ఐఎండీ 
  • నైరుతి ప్రభావంతో 86 రోజులపాటు వర్షాలు పడ్డాయని వెల్లడి
  • నేడు దక్షిణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు  

హైదరాబాద్, వెలుగు: ఈ నెలలో కూడా వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగానే కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తెలంగాణ సహా దక్షిణ భారతంలో వర్షపాతం 112 శాతం కన్నా ఎక్కువే రికార్డ్ అవుతుందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సీజన్ లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వర్షాకాలం పూర్తి కావడంతో పోస్ట్​మాన్సూన్ వాతావరణ పరిస్థితులపై ఐఎండీ బుధవారం బులెటిన్​ను విడుదల చేసింది. వర్షాలు పెరగడంతోపాటు ఎండల ప్రభావం తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్​లో పేర్కొన్న ఐఎండీ.. రాత్రి టెంపరేచర్లు మాత్రం సాధారణం కన్నా ఎక్కువ నమోదవుతాయని తెలిపింది.   

నైరుతిలో 86 రోజులు వానలు 

రాష్ట్రంలో నైరుతి ప్రభావంతో 86 రోజుల పాటు వర్షాలు కురిశాయి. జూన్​3న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంటరవగా.. సెప్టెంబర్ నెలాఖరుతో రుతుపవనాలు వాపస్ వెళ్లిపోయాయి. ఈ నాలుగు నెలల్లో దాదాపు 3 నెలల పాటు వర్షాల ప్రభావం కనిపించింది. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాలో 78 రోజులు వర్షాలు పడగా.. ములుగులో 77 రోజుల పాటు వర్షాలు పడ్డాయి. ఒక్క జోగులాంబ, మేడ్చల్ మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల్లోనూ 50 రోజులకుపైగానే వర్షాలు కురిశాయి. గద్వాల జిల్లాలో 45 రోజులు, మేడ్చల్ జిల్లాలో 48 రోజులపాటు వర్షాలు పడ్డాయి. 

మొత్తంగా 12 జిల్లాల్లో వెయ్యి మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం రికార్డ్ కావడం విశేషం. ములుగులో అత్యధికంగా 1,582.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 1,247.5, మహబూబాబాద్​లో 1,207.4, ఆసిఫాబాద్​లో 1,176.1, ఖమ్మంలో 1,133.8, భూపాలపల్లిలో 1,129.6, నిర్మల్​లో 1,104.1, నిజామాబాద్​లో 1,093.3, ఆదిలాబాద్​లో 1,072.9, జగిత్యాలలో 1,036.7, వరంగల్​లో 1,036.4, పెద్దపల్లిలో 1,013.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో 964.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈసారి ప్రతి నెలలోనూ మంచి వర్షాలు పడ్డాయి. జూన్​లో 159 మిల్లీమీటర్లు, జులైలో 294.8, ఆగస్టులో 209.9, సెప్టెంబర్​లో 298.9 మిల్లీమీటర్ల మేర వర్షపాతం రికార్డ్ అయింది. 

నేడు దక్షిణ జిల్లాల్లో వర్షం 

రాష్ట్రంలోని పలు దక్షిణాది జిల్లాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్​జారీ చేసింది. హైదరాబాద్ సిటీలోనూ రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. కాగా, బుధవారం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 11 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.  

నైరుతి వాపస్.. పెరుగుతున్న వేడి

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో ఎండలు ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వేడి క్రమంగా పెరుగుతున్నది. బుధవారం 9 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. సంగారెడ్డి జిల్లాలో 40.4, నిజామాబాద్​లో 40.3, ఖమ్మంలో 40.2, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్​జిల్లాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 వరంగల్, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో 39.8, సూర్యాపేటలో 39.7, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో 39.6, జగిత్యాల, వనపర్తి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో 39.5, మహబూబ్​నగర్ లో 39.4, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో 39.3, మెదక్ లో 39.2, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 39.1, నారాయణపేట, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల్లో 39, వికారాబాద్ లో 38.9, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్​జిల్లాల్లో 38.6, నాగర్​కర్నూల్​లో 38.5, రాజన్న సిరిసిల్లలో 37.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో 39 నుంచి 40.7 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి.