- కాలిబూడిదైన ఇల్లు..తల్లి, తండ్రి, కూతురు మృతి
- అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు
ఒట్టావా : కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇండియన్ కుటుంబం సజీవదహనమైంది. ప్రమాదంలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె మృతిచెందారు. మార్చి 7న బ్రాంప్టన్‌లోని బిగ్ స్కై వే, వాన్ కిర్క్ డ్రైవ్ ఏరియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుపట్టలేకుండా పూర్తిగా కాలిపోయిన మృతదేహాలకు పరీక్షలు జరిపారు. మృతులను భారత సంతతికి చెందిన రాజీవ్ వారికూ(51), అతని భార్య శిల్ప కొత్త (47) వారి కుమార్తె మహెక్ వారికూ (16)గా నిర్ధారించారు. అగ్నిప్రమాదం అనుమానాస్పదంగా ఉందని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తున్నామని స్థానిక పోలీస్ ఆఫీస్ టర్యిన్ యంగ్ తెలిపారు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం కాదని ఫైర్ డిపార్ట్మెంట్ అభిప్రాయపడిందన్నారు. అలాగే మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో నుంచి పెద్ద పేలుడు సౌండ్ వచ్చినట్లు చుట్టుపక్కల వారు తెలిపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద ఘటనగా భావించి మర్డర్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసే బ్యూరోకు కేసు దర్యాప్తును అప్పగించినట్లు యంగ్ తెలిపారు. రాజీవ్ ఒంటారియో హెల్త్ మినిస్ట్రీలో పనిచేసేవాడని పేర్కొన్నారు.
రాజీవ్ కుటుంబం 15 ఏండ్లుగా ఈ ఏరియాలో నివసిస్తున్నదని వారి ఇంటి పొరుగున ఉన్న కెన్నత్ యూసుఫ్ చెప్పినట్లు సీ టీవీ అనే న్యూస్‌చానెల్ తెలిపింది. ‘‘ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం రావడంతో బయటికి వచ్చి చూశామని.. ఇంట్లో మంటలు చెలరేగడంతో ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులకు సమాచారం ఇచ్చాం. కొద్ది సేపట్లో చూస్తుండగానే ఇల్లు కాలి బూడిదైంది” అని అతను చెప్పినట్లు పేర్కొన్నది.