కెనడాలో పంజాబ్‌‌‌‌ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

కెనడాలో పంజాబ్‌‌‌‌ స్టూడెంట్ అనుమానాస్పద మృతి
  • 4 రోజుల కింద తప్పిపోయిన యువతి
  • ఒట్టావాలోని బీచ్‌‌‌‌ వద్ద డెడ్‌‌‌‌బాడీ లభ్యం

ఒట్టావా: కెనడాలో మనదేశానికి చెందిన స్టూడెంట్‌‌‌‌ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నాలుగు రోజుల కింద బయటికి వెళ్లిన ఆమె కనిపించకుండాపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఒట్టావాలోని బీచ్‌‌‌‌లో ఆమె డెడ్‌‌‌‌బాడీని గుర్తించారు. పంజాబ్‌‌‌‌లోని డేరాబస్సీకి చెందిన వంశిక శైనీ(21) హయ్యర్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌ కోసం రెండేండ్ల కింద కెనడాకు వెళ్లారు. పదిరోజుల కిందే ఫైనల్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ పూర్తవడంతో కిరాయి ఇంటిని వెతికేందుకు ఏప్రిల్‌‌‌‌ 25న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన వంశిక తిరిగి రాలేదు. వంశిక ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులతో ఫోన్‌‌‌‌కాల్‌‌‌‌ మాట్లాడేవారు. అయితే, 25 తేదీన ఆమె ఫోన్‌‌‌‌ స్విచ్చాఫ్‌‌‌‌ అని వచ్చేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే రోజు రాత్రి 12 గంటలకు ఆమె ఫోన్‌‌‌‌ స్విచ్ఛాప్‌‌‌‌ అయినట్లు గుర్తించారు. 

నాలుగురోజులపాటు ఆమెకోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఒట్టావాలోని బీచ్‌‌‌‌లో వంశిక డెడ్‌‌‌‌బాడీ లభ్యమైంది. ఈ విషయాన్ని అక్కడి ఇండియన్‌‌‌‌ ఎంబసీ కూడా ధృవీకరించింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తున్నట్లు తెలిపింది. స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వంశిక తండ్రి పంజాబ్‌‌‌‌ ఆప్ నేత దేవీందర్‌‌‌‌‌‌‌‌ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆమె సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదని, బిడ్డ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా భారత్‌‌‌‌ చర్యలు తీస్కోవాలని కోరారు.