మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్

మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్

న్యూఢిల్లీ: స్విస్​ బ్యాంకులలో మూలుగుతున్న మన వాళ్ల బ్లాక్​మనీ వివరాలు తెలుసుకోవడానికి కొత్త అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మన దేశంలో బ్లాక్ మనీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక చట్టంలోని కఠినమైన సెక్షన్లపై స్విస్​ కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. తమ సమాచారాన్ని ఇండియాకు ఇవ్వకూడదన్న రిక్వెస్టులపై అక్కడి కోర్టులు ఈ ఏడాదే విచారణ జరపబోతున్నాయి. ఫారిన్​లో రసహ్యంగా బ్యాంకు ఖాతాలు, ఆస్తులు ఉన్న ఇండియన్లపై ప్రభుత్వ ఏజెన్సీలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. చాలా మంది భారతీయ సంపన్నులకు స్విస్​ బ్యాంకుల్లో ఖాతాలు, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. ఇండియా తెచ్చిన చట్టం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  ‘‘స్విస్​ బ్యాంకులు అందజేసిన సమాచారం ఆధారంగా ఇండియా ఆఫీసర్లు ఖాతాదారులపై క్రిమినల్​ చర్యలు తీసుకోవడం వీలు కాదు. పన్నుల వసూలు కోసం మాత్రమే స్విక్​ బ్యాంకులు ఇండియాకు ఖాతాల సమాచారం ఇచ్చాయి. పాత లావాదేవీలపైనా ప్రస్తుత రూల్స్​ ప్రకారం చర్యలు తీసుకునేందుకు చట్టం వీలు కల్పిస్తున్నది. ఇది సరైన విధానం కాదు ”అని ఎక్స్​పర్టులు వాదిస్తున్నారు. బ్లాక్ మనీ చట్టం స్విస్​ న్యాయ విధానానికి, విలువలకు వ్యతిరేకమని లాయర్లు అంటున్నారు.  అప్పీలుదారులు ఇండియా ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్ నుండి స్విట్జర్లాండ్‌‌కి వచ్చిన 'ఇన్ఫర్మేషన్​ రిక్వెస్ట్​'లో బ్లాక్ మనీ యాక్ట్ ప్రస్తావన ఉన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.   ఖాతాదారులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ)  ప్రాసిక్యూట్ చేయగలదని అందులో స్పష్టంగా పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ మేరకు అందిన నోటీసుల గురించి ఫిర్యాదు చేశారు. మనీలాండరింగ్‌‌కు సంబంధించి తన దగ్గరున్న అన్ని వివరాలను ఐటీ విభాగం ఈడీకి అందజేస్తుంది. 

స్విస్​ సుప్రీంకోర్టు ఏమన్నదంటే...

‘‘రెండు దేశాల మధ్య ఒప్పందం మేరకు.. స్విస్​ బ్యాంకులు ఇండియాకు అకౌంట్ల సమాచారాన్ని ఇచ్చాయి. దీని ప్రకారం ఇలాంటి వివరాలను పన్ను అవసరాల కోసం మాత్రమే వాడాలి”అని స్విస్​ సుప్రీంకోర్టు పోయిన ఏడాది తీర్పు చెప్పింది.  ఇండియా– స్విస్ పన్ను ఒప్పందం ప్రకారం 'సమాచార మార్పిడి'  రూల్స్​ 2011 నుంచి మళ్లీ అమలవుతున్నాయి. అయితే బ్లాక్​మనీ (వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు)   చట్టం 2015లో అమల్లోకి వచ్చింది.‘‘స్విస్​కోర్టుల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ చట్టంలోని క్రిమినల్ పన్ను నిబంధనలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లకు అనువుగా లేవు. ఐటీ చట్టం ప్రకారం స్విస్​తో పన్ను ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండవది, మనదేశ ట్యాక్స్​ ఆఫీసర్లు  పన్ను ఒప్పందం కింద అందుకున్న సమాచారాన్ని బట్టి 2015 ముందు లావాదేవీలపై క్రిమినల్​ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ”అని ఏజెడ్​బీ అండ్​ పార్ట్​నర్స్​ అనే లా ఫర్మ్​ పార్ట్నర్​ ఆయుష్ టాండన్ అన్నారు. ఇండియా ఐటీ చట్టం ప్రకారం 11 ఏళ్ల క్రితం నాటి ట్రాన్సాక్షన్లపైనా పన్ను వసూలు చేయవచ్చు. అంతేకాదు సంబంధిత ఆస్తులు ఎలా వచ్చాయో అడిగే అధికారం బ్లాక్​మనీ చట్టం ప్రకారం ఆఫీసర్లకు ఉంటుంది. అప్పుడు సంపాదించిన ఆదాయానికి సంబంధించిన లెక్కలూ అడుగుతారు. ఆనాటి ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదు కాబట్టి బ్లాక్​మనీ చట్టం సెక్షన్​ 11 ప్రకారం పన్ను ఎగవేతగానూ చూసే అవకాశం ఉంది. "దేశాల మధ్య సమాచారాన్ని పంచుకునే విధానంలో రెండు ముఖ్యమైన రూల్స్​ ఏమిటంటే, అటువంటి భాగస్వామ్యం దేశ (స్విస్​) చట్టాలకు విరుద్ధంగా సమాచారం తీసుకునే దేశాల్లో చట్టం ఉండకూడదు.  అలాంటి దేశాలు తమ స్థానిక చట్టాలకు భిన్నంగా ఉండే చర్యలను చేపడితే ఊరుకోవు.  పాత తేదీల్లో జరిగిన ట్రాన్సాక్షన్లపై క్రిమినల్​చర్యలు తీసుకోవడం స్విస్  చట్టాల ప్రకారం కుదరదు. ఇండియా అలా చేస్తే స్విస్​ పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు అవుతుంది ”  ఖైతాన్ & కో పార్ట్​నర్​ ఆశిష్ మెహతా అన్నారు. ఇండియా ఆఫీసర్లు స్విట్జర్లాండ్​కు ఇన్ఫర్మేషన్​కోసం పంపిన రిక్వెస్టుల్లో బ్లాక్​మనీ చట్టం గురించి తెలియజేశారు. ఇప్పుడు స్విస్​ కోర్టులు ఎలా రెస్పాండ్​ అవుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది.