- అందుబాటులో 20 రకాల యూనిట్స్
- ఆసక్తి ఉన్న వారికి మొబైల్ ఫిష్ వెహికల్స్ మంజూరు
- ఈ ఏడాది జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ లక్ష్యం
మెదక్, వెలుగు: మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోంది. స్వయం సహాయ సంఘాల్లో (ఎస్హెచ్ జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా రుణ సాయం అందజేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో 'ఇందిరా మహిళా శక్తి పథకం' ప్రవేశపెట్టి స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు చేయూతనందిస్తోంది. మహిళలకు అనువైన, ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే వివిధ చిరు వ్యాపారాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తోంది.
పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తూ తద్వారా వారు ఆర్థిక స్వావలంభన సాధించేందుకు బాటలు వేస్తోంది. మెదక్ జిల్లాలో 20 మండల సమాఖ్యలు, 521 గ్రామైఖ్య సంఘాలు,13,640 స్వయం సహాయక సంఘాల్లో1,36,547 మంది మహిళలు మెంబర్లుగా ఉన్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఇందిరా మహిళా శక్తి పథకంలో పౌల్ట్రీ ఫామ్స్, నాటు కోళ్ల పెంపకం, క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ మార్కెట్లు, మీసేవా కేంద్రాలు తదితర 20 రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకునే మహిళలు తమకు ఆసక్తి ఉన్న, నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చు.
క్యాంటీన్ల నిర్వహణ
మెదక్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ విజయవంతంగా నడుస్తోంది. టిఫిన్లు, భోజనం, స్నాక్స్, టీ, కాఫీ ఈ క్యాంటిన్లో అందుబాటులో ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్లోని ఆయా డిపార్ట్మెంట్లకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా ఆఫీసుల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఈ క్యాంటిన్ ఎంతగానో ఉపయోగపడుతోంది.
మెదక్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సరస్వతి స్లమ్ సమాఖ్య మహిళలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ పథకంలో భాగంగా ఇటీవల నార్సింగికి చెందిన కల్యాణికి రూ.10 లక్షల విలువైన మొబైల్ చేపల విక్రయ వాహనాన్ని మంజూరు చేశారు. కల్యాణికి రూ.4 లక్షల లోన్ మంజూరు కాగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల సబ్సిడీ మంజూరైంది.
సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలని కోటీశ్వరులుగా తయారు చేయాలన్నది లక్ష్యం. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడే ఈ పథకాన్ని జిల్లా మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది రూ.100 కోట్లు మహిళలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలు మంచి ఆదాయం సంపాదించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి, ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలవాలి. రాహుల్రాజ్, కలెక్టర్