- మొదలైన గ్రామ, వార్డు సభలు.. భారీగా హాజరైన జనం
- లిస్టులో అర్హుల పేర్లు రాలేదంటూ కొన్ని గ్రామాల్లో ఆందోళన
- అర్హులందరికీ పథకాలు అందుతాయని ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల హామీ
నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్‌లకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలిరోజు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ మూడు స్కీమ్ లతోపాటు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలోని అర్హులను గుర్తించి, అనర్హుల పేర్లు తొలగించేందుకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలకు మంగళవారం జనం భారీగా తరలివచ్చారు. జాబితాలో పేర్లు రాని వారు అక్కడికక్కడే దరఖాస్తులు సమర్పించారు. అర్హత ఉండి జాబితాలో రాకపోవడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హుల పేర్లు చేర్చి, తమ పేరు ఎందుకు తొలగించారని మండిపడ్డారు.
దరఖాస్తుల వెల్లువ..
కరీంనగర్, వెలుగు: మంగళవారం ప్రారంభమైన గ్రామ, వార్డు సభలు 24 వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల చొప్పున సభలు నిర్వహిస్తున్నారు. అయితే తొలి రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు పథకాలకు సంబంధించిన జాబితాలో అర్హులైన చాలా మంది పేర్లు రాలేదు. దీంతో పేర్లు రాని వారంతా అక్కడే దరఖాస్తులు పూర్తి చేసి సమర్పించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలిరోజు 30 డివిజన్లలో నిర్వహించిన వార్డు సభల్లో రేషన్ కార్డుల కోసం 9,699 అప్లికేషన్లు రాగా, ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,412 అప్లికేషన్లు వచ్చాయి. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిటీలోని 9వ డివిజన్ లో నిర్వహించిన వార్డు సభకు మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు.
గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు: రామగుండం బల్దియా 31, 27వ డివిజన్లలో నిర్వహించిన వార్డు సభలకు మేయర్ బంగి అనిల్ కుమార్, అడిషనల్కలెక్టర్, కమిషనర్ జె.అరుణశ్రీ, అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 35 వేల దరఖాస్తులు రాగా క్షేత్ర పరిశీలన చేసి 28,539 మంది పక్కా ఇల్లు లేని వారీగా గుర్తించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలోని పలు వార్డులో జరిగిన వార్డు సభల్లో అర్హుల జాబితాలో పేర్లు రాని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు.
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 2వ వార్డు, మేడిపల్లి మండలం దమ్మన్న పేటలో నిర్వహించిన వార్డు, గ్రామసభల్లో కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు. లిస్టులో పేర్లు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం
చేశారు.