
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో 3,096 మంది లబ్ధిదారులు
- 1,038 ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం
- ఇటీవల లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చకచకా నడుస్తున్నాయి. ఇటీవల బేస్మెంట్స్థాయిలో నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ. లక్ష చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో మిగతా లబ్ధిదారులు కూడా ఇండ్ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 1,24,444 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 85,461 మంది స్థలం ఉండి ఇండ్లు లేనివాళ్లు కాగా, 38,983 మంది స్థలం, ఇల్లు లేనివాళ్లు ఉన్నట్లుగా తేలింది.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా అందిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో స్థలం ఉండి ఇండ్లు లేని వాళ్లకు రూ. 5లక్షల చొప్పున ప్రభుత్వం నిర్మాణాల దశలను బట్టి మంజూరు చేస్తోంది. మొదటి దశలో భాగంగా జిల్లాలోని 22 మండలాల్లో స్థలం ఉండి ఇండ్లు లేని 3,096 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.
1,038 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాలకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మార్క్ చేశారు. ఈ క్రమంలో బేస్ మెంట్ నిర్మించుకున్న 107 మంది లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున డబ్బులు ఇప్పటికే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. స్లాబ్ లెవెల్రూ.లక్ష, స్లాబ్ తర్వాత రూ. 2లక్షలు, నిర్మాణం పూర్తి అయిన తర్వాత రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 5లక్షలను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. దీనిపై లబ్ధిదారులు హర్షం
వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు పడ్తాయనుకోలె..
ఇంత త్వరగా డబ్బులు పడ్తాయనుకోలె. ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత డబ్బులు రాకపోతే ఎట్లా అని మొదట భయపడ్డ. కానీ బేస్ మెంట్ పూర్తి కాగానే ఖాతాలో రూ. లక్ష డబ్బులు జమ అయ్యాయి. - జి. నాగరాజకుమారి, జానకీపురం, అన్నపురెడ్డిపల్లి
ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెరిగింది..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెరిగింది. బేస్ మెంట్ వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి మొదటి విడతలో భాగంగా రూ. లక్ష వారి ఖాతాల్లో పడేలా ఎప్పటికప్పుడు బిల్లులు చేస్తున్నాం. అందుకు ఇండ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. -శంకర్, హౌసింగ్పీడీ, భద్రాద్రికొత్తగూడెం
ఆనందంగా ఉంది..
మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ వరకు కట్టగానే సర్కారు లక్ష రూపాయలు నా ఖాతాలో జమ చేసింది. ఇల్లు కట్టుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇల్లు కవాఆలనే ఏండ్లనాటి కల ఇప్పుడు నెరవేరుతోంది. - షభాన, బెండాలపాడు, చంద్రుగొండ మండలం