ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం!.. ఎక్కువ మంది అనర్హులే

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం!.. ఎక్కువ మంది  అనర్హులే
  • మొదటి విడతలో ఇచ్చిన 71 వేల ఇండ్లల్లో సగం దాకా అనర్హులే!
  • 1,200 ఇండ్లకు మాత్రమే బేస్​మెంట్
  • నిధులు రెడీగా ఉన్నా.. రిలీజ్ చేయలేని పరిస్థితి
  • ఒక్కో గ్రామం నుంచి వెయ్యికి పైగా పేర్లు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
  • అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు
  • రీ వెరిఫికేషన్​కు సిద్ధమవుతున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం నెలకొన్నది. ఈ స్కీమ్​లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 71 వేల ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్లు తెలుస్తున్నది. మంజూరు పత్రాలు అందజేసిన వారిలో 90 శాతానికి పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించలేదు. 

కేవలం 1,200 ఇండ్లకు మాత్రమే బేస్‌‌మెంట్ పడ్డాయి. కారణమేంటని అధికారులు ఆరా తీయగా.. ఎంపిక చేసిన వారిలో చాలా మంది అనర్హులున్నారని, వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించడం లేదని తెలిసి షాక్​కు గురయ్యారు. దీనికితోడు అర్హుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో రీ వెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు.

ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2024, మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల  పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, స్థలం లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపికలో అవినీతి, పక్షపాతానికి చెక్ పెట్టేందుకు 2024, డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఇండ్లు’ యాప్‌‌ను ఆవిష్కరించారు.  దాదాపు 60 లక్షల మంది అర్హులుగా తేల్చారు. జనవరి 10 వరకు యాప్​లో లబ్ధిదారుల లిస్ట్ ను అప్డేట్ చేశారు. 

అర్హుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం

మొదటి విడతలో 71,482 మంది లబ్ధిదారులకు 2025, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మంజూరు పత్రాలు ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా చేపట్టింది. కానీ.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని లబ్ధిదారుల లిస్టుల్లో తమ అనుచరుల పేర్లను చేర్చినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఒక్కో గ్రామం నుంచే వెయ్యి, ఆ పైన పేర్లు ఇచ్చినట్లు సమాచారం. 

అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకపోవడంతో పెద్దసంఖ్యలో అనర్హులు ఎంపికయ్యారు. ఇప్పటికే ఇండ్లు ఉన్న వీరంతా ఇందిరమ్మ ఇండ్లకు బేస్​మెంట్లు వేయడం లేదు. అనర్హులను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లబ్ధిదారుల లిస్ట్ ను మరోసారి వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నారు.

మూడు దశల్లో ఆర్థిక సాయం

2024-–25 బడ్జెట్‌‌లో ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.9,184 కోట్లు కేటాయించగా, కేంద్రం నుంచి పీఎంఏవై పథకం కింద రూ.4,600 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 2025–26 బడ్జెట్‌‌లోనూ  రూ.12,571 కోట్లు ప్రతిపాదించారు. ఏటా 4 లక్షల ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిధులను దశలవారీగా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నిధులు బేస్‌‌మెంట్, గోడలు, శ్లాబ్, ఇల్లు పూర్తయ్యాక ఇలా నిర్మాణ దశల ఆధారంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. 

కానీ, ఇప్పటివరకు 1,200 ఇండ్లలోపే బేస్‌‌మెంట్ పడింది. నిధులు సిద్ధంగా ఉన్నా, నిర్మాణం మొదలు కాకపోవడంతో ఫస్ట్ ఇన్‌‌స్టాల్‌‌మెంట్ ఆగిపోయింది. బేస్‌‌మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి విడతగా రూ.లక్ష, గోడల నిర్మాణం అయ్యాక రూ.1 లక్ష,  శ్లాబు వేసిన తర్వాత మూడో దశలో  రూ.1.25 లక్షలు, పూర్తి నిర్మాణం అయ్యాక రూ.1.75 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది.