సొంతింటి కలకు అడుగులు డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ సిద్ధం

సొంతింటి కలకు అడుగులు డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ సిద్ధం
  • 45 గజాలలో ఇంటి నిర్మాణం
  • మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికే అవకాశం
  • అర్హుల గుర్తింపు తర్వాత నిర్మాణాలపై అవగాహన కార్యక్రమం

మహబూబ్​నగర్, వెలుగు: పేదల సొంతింటి కలకు అడుగులు పడుతున్నాయి. జనవరి 26 నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ స్కీమ్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. త్వరలో సొంత జాగా ఉన్న వారికి ఫస్ట్​ ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. 

ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణం చేపడుతున్నారు. మహబూబ్​నగర్​ నిమోజకవర్గంలోని మహబూబ్​నగర్​ రూరల్​ మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల వీరయ్య తన సొంత జాగలో ఇంటిని నిర్మించుకున్నాడు. దీనిని డెమోగా చూయిస్తూ.. ఈ నిర్మాణం ప్రకారం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. అర్హుల గుర్తింపు పూర్తయిన తరువాత వారికి ఈ నిర్మాణం ఎలా ఉంటుంది? ఎన్ని గజాలలోపు నిర్మించుకోవాలనే దానిపై హౌసింగ్​ ఆఫీసర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

45 గజాల్లో ఇంటి నిర్మాణం..

ఇందిరమ్మ ఇంటిని 45 గజాల్లో నిర్మించేలా డిజైన్​ చేశారు. ఇంటి లోపల ఒక బెడ్రూమ్​ విత్​ అటాచ్​ బాత్రూమ్, ఒక హాల్, కిచెన్​ ఉంటాయి. ఇంటి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్​ చేశారు. ఇంటికి రెండు వైపులా రెండు దర్వాజాలు, వెంటిలేషన్  ఎక్కువగా రావడానికి హాల్​లో రెండు కిటికీలు, కిచెన్​లో ఒకటి, బెడ్రూమ్​లో ఒక కిటికీని అమర్చారు. కిచెన్​లో సింక్​ విత్​ పైప్​లైన్​ ఏర్పాటు చేశారు.

వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్​ ట్యాంక్​ను ఏర్పాటు చేయగా.. దాని ద్వారా కిచెన్, బాత్రూమ్​కు కనెక్షన్​ ఇచ్చారు. ఇదే తరహాలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. 45 గజాలకు కాకుండా 70 గజాల నుంచి 75 గజాల స్థలం ఉంటే లబ్ధిదారులు కాంపౌండ్​ వాల్​ నిర్మించుకోవచ్చు.

కొనసాగుతున్న వివాదాలు..

గత ప్రభుత్వ హయాంలో మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో పంపిణీ చేసిన డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి. దీనిపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్కీ డిప్​ ద్వారా కాకుండా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు ఒక్కో ఇంటిని అమ్ముకున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్​ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఎంక్వైరీకి ఆదేశించింది. 

దీనిపై మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో ఇటీవల విచారణ చేసిన రెవెన్యూ ఆఫీసర్లు అక్రమాలను గుర్తించారు. స్థానికులకు కాకుండా స్థానికేతరులు ఇండ్లను విక్రయించినట్లు తేల్చారు. వెయ్యి ఇండ్లకు పైగా అనర్హులకు కట్టబెట్టినట్లు సమాచారం. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్లలోనూ అక్రమాలు జరిగినట్లు విమర్శలున్నాయి. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా.. ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఫొటో పెడితేనే పేమెంట్లు..

ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో ఖాళీ జాగ ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే పంచాయతీ సెక్రటరీలు నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాలి. స్కీం కింద బేస్​మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్​ పేమెంట్​ ద్వారా మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు మంజూరు కానున్నాయి. ఈ నాలుగు దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫొటోను ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తేనే పేమెంట్​ మంజూరవుతుంది. ఫొటోలు అప్​లోడ్​ చేయకుంటే పేమెంట్​కు బ్రేక్​ పడుతుంది. అలాగే ఒక చోట మంజూరు వచ్చి.. మరో చోట నిర్మాణం చేపట్టినా పేమెంట్లు ఆగిపోతాయి.

గత సర్కారు మంజూరు చేసిన ఇండ్ల వివరాలు..

జిల్లా                              మంజూరైనవి     పూర్తైనవి
మహబూబ్​నగర్                  8,768            4,321​
నారాయణపేట                   2,017            00
నాగర్​కర్నూల్​                     5,500            320
వనపర్తి                                3,835            1,203
గద్వాల                                2,070            580