హౌసింగ్​​శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

హౌసింగ్​​శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
  • గతంలో ఇతర శాఖలకు పంపిన సిబ్బంది తిరిగి  హౌసింగ్​ శాఖకు 
  • ఇప్పటికే జిల్లాల్లో విధుల్లో చేరుతున్న అధికారులు
  • కామారెడ్డి జిల్లాలో  నలుగురి రాక
  • యాప్​ ద్వారా లబ్ధిదారుల సర్వే  

కామారెడ్డి, వెలుగు: గతంలో  మాదిరి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం  హౌసింగ్​ శాఖ ఆధ్వర్యంలోనే  జరగనుంది.   దీంతో హౌసింగ్​శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన సిబ్బందిని తిరిగి  సొంత శాఖకు రప్పిస్తున్నారు.  ఇప్పటికే పలువురు మాతృశాఖలో రిపోర్ట్​ చేయడంతో  వీరిని  ఆయా జిల్లాలకు ప్రభుత్వం కేటాయిస్తోంది.  గతంలో  ప్రభుత్వం చేపట్టే ఇండ్ల నిర్మాణం  హౌసింగ్​ శాఖ పర్యవేక్షించేది.    జిల్లాల్లో ఈఈ, డీఈలు, ఏఈలు, వర్క్​ ఇన్స్​పెక్టర్లు , ఇతర సిబ్బంది ఉండేవారు.

  ప్రభుత్వ ఇండ్ల నిర్మాణ పక్రియ వీరి ఆధ్వర్యంలోనే జరిగేది.  లబ్ధిదారులకు సిమెంట్,  ఇతర సామగ్రితో పాటు  చెల్లింపులు  వీరే చూసేవాళ్లు.   గత పదేళ్లుగా  హౌసింగ్​ శాఖను పట్టించుకోలేదు.  బీఆర్​ఎస్​ ప్రభుత్వం  హౌసింగ్​ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందిని ఇతర శాఖలకు కేటాయించింది.

ఇతర శాఖలకు కేటాయింపు

మున్సిపల్,  జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, పంచాయతీరాజ్​, బేవరేజెస్​ తదితర శాఖలకు హౌసింగ్​ సిబ్బందిని బీఆర్​ఎస్​ ప్రభుత్వం కేటాయించింది.   సిబ్బంది కేటాయింపులతో జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే మిగిలారు.  ప్రతీ జిల్లాలో డీఈ స్థాయి అధికారి మాత్రమే ఉండగా,  కొన్ని చోట్ల ఒకరిద్దరు సిబ్బందిని ఉన్నారు.  గత​ ప్రభుత్వం చేపట్టిన డబుల్​ బెడ్​ రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతల్ని ఇతర  ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించింది.  ఒక్కో జిల్లాలో ఒక్కో శాఖకు ఇచ్చారు.  

 పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ,   సోషల్​ వెల్ఫేర్​ వంటి  ఇంజనీరింగ్ విభాగాలు  డబుల్​ బెడ్​ రూం  ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేవి.  నోడల్​ ఆఫీసుగా హౌసింగ్​ శాఖను ఉంచి  నిర్మాణ  పక్రియ పూర్తిగా ఆయా ఇంజనీరింగ్​ విభాగాలు చేపట్టాయి.  మిగిలిన ఒకరిద్దరు అధికారులు, సిబ్బంది  నోడల్​ ఏజేన్సీ ఆఫీసులో ఉంటూ నిర్మాణ పక్రియను  మానిటరింగ్​ చేసే వారు.  

తాజాగా హౌసింగ్​ శాఖకు..

ప్రస్తుతం ప్రభుత్వం  హౌసింగ్ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన సిబ్బంది తిరిగి తమ సొంత శాఖకు పంపిస్తోంది.   రాష్ర్ట ప్రభుత్వం  ఇండ్ల నిర్మాణ బాధ్యతల్ని ఈ​ శాఖకు అప్పగిస్తోంది.    ఇప్పటికే పలు జిల్లాల్లో డీఈలు, ఏఈలు విధుల్లో చేరారు.  కామారెడ్డి జిల్లాకు నలుగురు ఆఫీసర్లు వచ్చారు.   ఇందులో ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలు ఉన్నారు. 

ఇది వరకు నోడల్​ ఆఫీసులో ఒక డీఈ ఉండేవారు.  ప్రస్తుతం వీరి సంఖ్య ఐదుకు చేరింది.  నిజామాబాద్​ జిల్లాలో ఇద్దరు డీఈలు రిపోర్టు చేశారు. గతంలో ఒకరు ఉండేవారు.  ప్రస్తుతం ఈ జిల్లాలో  అధికారుల సంఖ్య మూడుకు చేరింది.   మరికొంతమంది ఏఈలు  వచ్చే అవకాశం ఉంది.  ఒక్కో డీఈకి ఒక  రెవెన్యూ డివిజన్​ పరిధి కేటాయించటమా,  నియోజక వర్గ పరిధి బాధ్యతలు అప్పగించటమా అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు  రావాల్సి ఉంది.   

నియోజక వర్గానికి 3,500  ఇండ్లు

ప్రతీ నియోజక వర్గానికి  3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.  ఉమ్మడి  నిజామాబాద్​ జిల్లాలో తొమ్మిది నియోజక వర్గాలు ఉన్నాయి.  31,500 ఇండ్లు మంజూరయ్యాయి.   ఇది వరకే గ్రామ, పట్టణ, వార్డు స్థాయిల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు.  లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్​ రూపొందించారు. ఈ యాప్​ను  సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం అధికారికంగా  రిలీజ్​ చేశారు. 

గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీల పరిధిలో వార్డు అధికారి యాప్​లో లబ్ధిదారుల వివరాల్ని పొందుపరుస్తారు.   కొద్ది రోజుల క్రితం ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో  ఇండ్ల కోసం ఎవరు దరఖాస్తు పెట్టుకున్నారో వారి వివరాలు సేకరిస్తారు.   ప్రతీ మండల కేంద్రంలో మోడల్​ హౌస్​ నిర్మిస్తారు.  ఇది 400 చదరపు అడుగుల్లో ఉంటుంది.  ఇందుకోసం మండల కేంద్రాల్లో స్థలాలను అధికారులు  పరిశీలిస్తున్నారు.