
- కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండ్
- అల్లోల చేరికను వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ లీడర్లు
- సయోధ్య కుదిరాకే నిర్ణయం
నిర్మల్, వెలుగు : మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆయన సన్నిహితులంతా ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా అల్లోల చేరికకు మాత్రం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఐకే రెడ్డి చేరికను నిర్మల్ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నందునే ఆయన చేరికపై స్పష్టత రావడం లేదని పలువురు అంటున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన అనుచరులు
ఐకే రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని చాలా రోజుల నుంచే జిల్లాలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశంతోనే ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ స్థాయి సమీక్షకు కూడా హాజరుకాలేదు. కాంగ్రెస్‌లో చేరిక విషయంపై నిర్మల్‌లోని తన అనుచరులతో కూడా చర్చలు జరిపారు. ఇంద్రకరణ్‌రెడ్డి సన్నిహితులైన ముథోల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌లో చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన గత పది రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి కాంగ్రెస్‌లో చేరికపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అడ్డుకుంటున్న జిల్లా లీడర్లు
ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరకుండా ఆ జిల్లాకు చెందిన పలువురు లీడర్లు అడ్డుకుంటున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాకుండా హైకమాండ్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు తమ అభ్యంతరాలను చెప్పారు. ఇంద్రకరణ్‌రెడ్డిని చేర్చుకోవద్దని హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన చేరిక వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరిన టైంలో వారి వెంటే ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఐకే రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంపై ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
సయోధ్య తర్వాతే చేరిక
ఇంద్రకరణ్‌రెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను పార్టీలో చేర్చుకుంటే నష్టం జరుగుతుందంటూ శ్రీహరిరావు వర్గీయులు హైకమాండ్‌కు తెలియజేశారు. దీంతో ఆయన చేరికపై హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావుతో పాటు సీనియర్లతో చర్చలు జరిపిన తర్వాతే ఇంద్రకరణ్‌రెడ్డిని చేర్చుకోవడమా ? లేక తిరస్కరించడమా ? అనే అంశం తేలనుంది. శ్రీహరిరావు వర్గం అంగీకరిస్తేనే ఇంద్రకరణ్‌రెడ్డి చేరికపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే శ్రీహరిరావును పిలిచి చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మల్ నియోజకవర్గ వ్యవహారాల బాధ్యత మొత్తం శ్రీహరిరావుకు అప్పగించేందుకు ఇంద్రకరణ్‌రెడ్డిని అంగీకరిస్తేనే సయోధ్య కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.