అప్పుడు ప్రమోషన్లు.. ఇప్పుడు క్షమాపణలు

అప్పుడు ప్రమోషన్లు.. ఇప్పుడు క్షమాపణలు

సోషల్​ మీడియాలో బెట్టింగ్​ యాప్స్​పై ఇన్​ఫ్లూయన్సర్ల  ప్రమోషన్స్​

  • ఒక్కో సెలబ్రిటీకి మిలియన్లలో ఫాలోవర్స్​
  • ప్రమోట్​ చేసినందుకు రూ.లక్షల నుంచి రూ.కోట్ల ఫీజు 
  • నిజమేనని నమ్మి మోసపోతున్న ఫాలోవర్స్​ 
  • బాధితులు కేసులు పెట్టడంతో దిగొస్తున్న ఇన్​ఫ్లూయన్సర్లు

ఓ మధ్యాహ్నం పూట రద్దీగా ఉన్న కేపీహెచ్​బీ రోడ్డుపైకి ఉన్నఫళంగా జనాలంతా దూసుకొచ్చారు. ఏంటా అని చూస్తే..  ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి, కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేశారు. ఆ నోట్లు ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. అదంతా డబ్బులు విసిరిన వారు వీడియో తీసి ఓ ఇన్​స్టా అకౌంట్​లో పోస్ట్​ చేశారు.

 తన దగ్గర డబ్బులు ఎక్కువై రూ.50 వేలను గాల్లోకి విసిరానని, తన లాగా ఈజీగా మనీ కోసం బెట్టింగ్స్​పెట్టాలని ఇన్​స్టా అకౌంట్​హోల్డర్​సలహా ఇచ్చాడు. ఇన్​స్టా బయో నుంచి టెలిగ్రామ్​లో జాయిన్​అవ్వాలని, అక్కడ బెట్టింగ్ యాప్ ​లింక్​ఇచ్చామని చెప్పాడు. లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఆ వ్యక్తిని నమ్మి ఇప్పటివరకు చాలామంది మోసపోయారు.’’

హైదరాబాద్, వెలుగు:ఆకట్టుకునేలా వీడియోలు తీసి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ఇన్​ఫ్లూయన్సర్లు నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు. బెట్టింగ్స్​తో లక్షలు వస్తాయని, తామూ లాభపడ్డామని అట్రాక్ట్​అయ్యేలా మాటలు చెప్పి బోల్తా కొట్టిస్తున్నారు. ప్రతి వీడియోలో బెట్టింగ్​యాప్స్ ​ప్రమోట్​చేస్తుండడంతో ఆసక్తి లేని వారు కూడా ట్రై చేసి ఆర్థికంగా దెబ్బతింటున్నారు.

 ఇన్​ఫ్లూయన్సర్ల మాటలు విని వేలు, లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. కాగా, కొద్ది రోజులుగా బెట్టింగ్​ యాప్స్​ ప్రమోటర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో ఇన్​ఫ్లూయన్సర్లు, సెలబ్రిటీలు దిగొస్తున్నారు. సోమవారం పంజాగుట్ట పీఎస్​పరిధిలో 11 మందిపై కేసులు నమోదు చేయడంతో దారికి వచ్చారు. తప్పయ్యిందని, అవగాహన లేక ప్రమోట్​చేశామని, క్షమించాలని వేడుకుంటున్నారు. ఇంకోసారి ఇలాంటివి చేయబోమంటున్నారు. 

సినీ తారల నుంచి మొదలు..  

ఏదైనా కంపెనీ తమ బ్రాండ్​ను ప్రమోట్ ​చేసుకోవాలనుకుంటే సినీ తారలు, క్రికెటర్లు, ఇతర స్పోర్ట్స్​పర్సన్స్​ను సంప్రదిస్తుంటారు. క్లాత్స్, సాఫ్ట్​ డ్రింక్స్, ఇతర యాడ్స్​లో సెలబ్రిటీలు ఎక్కువగా కనిపిస్తారు. గతంలో కొందరు జనాల ఆరోగ్యానికి హాని కలిగించే లిక్కర్, సిగరెట్స్ లాంటివి కూడా ప్రమోట్​చేసేవారు. కేంద్రం వాటిపై నిషేధం విధించడంతో అప్పటి నుంచి ఆగిపోయాయి. కొందరు సెలబ్రిటీలు సాఫ్ట్​ డ్రింక్స్, గుట్కా, పాన్​ మసాలాను ప్రమోట్​చేయడంపై స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇన్​ఫ్లూయన్సర్లకు భారీ ఆఫర్లు  

యూట్యూబ్​,ఫేస్​బుక్, ఇన్​స్టా, టెలిగ్రామ్​ వంటి యాప్స్​ వచ్చాక సెలబ్రిటీల స్థానాన్ని ఇన్​ఫ్లూయన్సర్లు భర్తీ చేస్తున్నారు. వారు తీసే వీడియో కంటెంట్​పేలితే తమ బ్రాండ్​ను ప్రమోట్​ చేసుకోవడానికి షాపులు, కంపెనీలు క్యూ కట్టి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సోషల్​మీడియాలోని ఫాలోవర్లను బట్టి ఇన్​ఫ్లూయన్సర్లకు టచ్​లోకి వస్తున్నారు. 

ఫాలోవర్స్, వీడియోల వ్యూస్​ను బట్టి భారీ ఆఫర్లు ఇస్తున్నారు. లక్షల నుంచి రూ.కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో మరో మాట మాట్లాడకుండా ఇన్ ఫ్లూయన్సర్లు ఒప్పేసుకుంటున్నారు. ప్రమోట్​చేస్తున్నవి ఫేక్​ యాప్సా లేక బ్యాన్​ చేసినవా అనేది ఆలోచించడం లేదు.  తమ ఫాలోవర్స్​కు లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా అన్నది పట్టించుకోవడం లేదు. తాము బాగుపడితే చాలని కోరుకుంటున్నారు. 

బ్యాన్ ​చేసిన యాప్​లు కూడా..

బ్యాన్​ చేసిన బెట్టింగ్ ​యాప్​లను వారి టెలిగ్రామ్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. నిషేధించిన యాప్​లు, వీపీఎన్​లను ఎలా వాడాలో సలహా ఇస్తున్నారు. ఇన్​స్టాలో యూజర్లను అట్రాక్ట్​ చేసి.. లింక్​ను బయోలో మెన్షన్​​ చేస్తున్నారు. టెలిగ్రామ్​లో జాయిన్​ అయ్యాక అందరినీ గ్రూప్​చేసి ఎలా ప్రెడిక్ట్​ చేయాలి, ఎలా బెట్టింగ్​ పెట్టాలి, బోనస్​లు ఏమిటి? ఆఫర్లు ఏమిటి?  విన్నింగ్​అమౌంట్​ను ఎలా క్లయిమ్​ చేసుకోవాలో చెప్తున్నారు. ఇలా అమాయకులను ఇన్​ఫ్లూయెన్స్​ చేసి దోచుకుంటున్నారు. 

షార్ట్​ కట్ ​రూట్లు కష్టాలు తెస్తాయి

ఇన్​ఫ్లూయన్సర్లు డిఫరెంట్​ కంటెంట్​తో వీడియోలతో తీయడంతో లక్షల్లో ఫాలోవర్స్​ వస్తున్నారు. నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. కొందరు ఎక్కువ డబ్బుకు ఆశపడి బెట్టింగ్​ యాప్స్​ప్రమోట్​ చేస్తున్నారు. తమను ఫాలో అవుతున్న వారే నష్టపోతారని తెలిసినా పట్టించుకోవట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు.. ప్రతి వ్యక్తికి సామాజిక స్పృహ, బాధ్యత ఉండాలి. ఈజీ వేలో తొందరగా డబ్బులు సంపాదించాలని అనుకోవద్దు. షార్ట్​కట్​రూట్లు కష్టాలు తెచ్చిపెడతాయి.  – జేవీ శ్రీరామ్, ప్రముఖ మోటివేషన ల్​ స్పీకర్

అప్పీయరెన్స్ ఇట్లుంటది 

ఇన్​ఫ్లూయన్సర్లు, సెలబ్రిటీలు నిజంగానే కోట్లు సంపాదిస్తున్నట్లు వీడియోలు చేస్తున్నారు. కరెన్సీ కట్టలను గాల్లోకి ఎగరేసి కొందరు, లగ్జరీ కార్ల ముందు నిలబడి మరికొందరు తమ దగ్గరున్న నోట్ల కట్టలు చూపిస్తూ బెట్టింగ్​లో సంపాదించామంటూ చెప్తున్నారు. ఇంకొంతమంది తమ వీడియోల మధ్య బెట్టింగ్​కు సంబంధించిన యాడ్​ వేసి బెట్టింగ్ ​చేస్తే కోట్లకు కోట్లు ఎలా వస్తాయో వివరిస్తున్నారు. దీంతో చాలామంది బెట్టింగ్​కు అడిక్ట్​ అవుతున్నారు. సినీ హీరోయిన్లు కాజల్ అగర్వాల్​, నిధి అగర్వాల్​, మంచు లక్ష్మితోపాటు చాలా మంది బెట్టింగ్​ యాప్స్​ను ప్రమోట్​ చేశారు. వారిపై  కూడా చర్యలు తీసుకోవాలని సోషల్​ మీడియాలో విజ్ఞప్తులు పెరుగుతున్నాయి.