- సీపీఎస్ఈయూ స్టేట్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కరీంనగర్, -మెదక్, -నిజామాబాద్,- ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి పేరును ఖరారు చేసినట్టు సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ ఈయూ) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 28 ఏండ్ల నుంచి టీచర్‌గా సేవలందిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇన్నారెడ్డిని ఎమ్మెల్సీ బరిలోకి దింపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఇటీవలే ‘వరంగల్’టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అసోసియేట్ ప్రొఫెసర్ వెంకటస్వామిను ప్రకటించినట్టు గుర్తుచేశారు. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఒకవైపు సీపీఎస్ ప్రతినిధిని, మరోవైపు ఓపీఎస్ ప్రతినిధిని బరిలో నిలుపుతున్నట్టు చెప్పారు.
సీపీఎస్ ఈయూ తరఫున పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ట్రెజరర్ నరేశ్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మ్యాన పవన్ కుమార్, పోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, టి.ఇన్నారెడ్డి పీఆర్టీయూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉండగా, శనివారం ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు.. ఓపీఎస్ సాధించడంలో పీఆర్టీయూ విఫలం కావడంతో, జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.