ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ.. విద్యార్థులకు వరం

ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ..  విద్యార్థులకు వరం
  • లక్సెట్టిపేట మోడల్​డిగ్రీ కాలేజీలో అందుబాటులో కోర్సు
  • నాలుగేండ్లలో ఇటు బీఏ, అటు బీఈడీ పూర్తి చేసే చాన్స్​ 
  • ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సువర్ణావకాశం
  • అవగాహన లోపంతో మిగిలిపోతున్న సీట్లు 
  • 2025–26 విద్యాసంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్​ 
  • ఆన్​లైన్​ అప్లికేషన్లకు 31 వరకు గడువు, ఏప్రిల్​29 ఎంట్రెన్స్​ టెస్ట్​

లక్సెట్టిపేట, వెలుగు: డిగ్రీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ కోర్సు ఓ వరం. నాలుగేండ్ల ఈ కోర్సులో చేరితే ఇటు డిగ్రీతో పాటు బీఈడీని ఏకకాలంలో పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత టెట్​లో అర్హత సాధించి డీఎస్సీకి ఎంపికైతే టీచర్​ జాబ్​ కొట్టేయవచ్చు. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు హాజరు కావచ్చు. రాష్ట్రంలో మూడు కాలేజీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అరుదైన కోర్సుపై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి ఇంటిగ్రేడెట్​ డిగ్రీలో అడ్మిషన్లకు ఇటీవలే నోటిఫికేషన్​ రిలీజ్​అయ్యింది. దరఖాస్తులకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. 

కాలేజీలో 50 సీట్లు

లక్సెట్టిపేటలోని గవర్నమెంట్ ​మోడల్ డిగ్రీ కాలేజీలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం బీఏ, బీఈడీ కోర్సును అందిస్తున్నారు. టీచర్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదువాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశం. ఈ కోర్సు రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడు కాలేజీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. హైదరాబాద్​లోని మను యూనివర్సిటీలో బీఎస్సీ, బీఈడీ, వరంగల్ ఎన్​ఐటీలో బీకాం, బీఈడీ, లక్సెట్టిపేట మోడల్​ డిగ్రీ కాలేజీ బీఏ, బీఈడీ కోర్సులను ఆఫర్​ చేస్తున్నాయి. 

ఈ కాలేజీని 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల రూసా(ఆర్​యూఎస్​ఏ) నిధులతో నిర్మించారు. అయితే విద్యార్థులకు అవగాహన లోపంతో సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. లోకల్​ విద్యార్థులు ఇంట్రెస్ట్​ చూపకపోయినప్పటికీ కర్ణాటక, ఒడిశా, కేరళ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్​తీసుకుంటున్నారు. 2023–24 సంవత్సరంలో ఈ కోర్సులో 29 మంది చేరగా, 2024–25లో 22 మంది మాత్రమే అడ్మిషన్​ తీసుకున్నారు. 

ఇంటిగ్రేటెడ్ ​డిగ్రీతో ఉపయోగాలు

నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ, బీఈడీ కోర్సుతో విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సాధారణంగా డిగ్రీ, బీఈడీ విడివిడిగా చేస్తే ఐదేండ్లు పడుతుంది. కానీ ఈ కోర్సు నాలుగేండ్లలోనే పూర్తవుతుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గైడ్​లైన్స్​ప్రకారం.. నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసినవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హులు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్​ నియామకాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సు పూర్తయిన వాళ్లు ఎంచుకున్న సబ్జెక్టులో పీజీ చేయడానికి చాన్స్​ ఉంటుంది. ఈ విద్యార్థులకు యూనివర్సిటీ స్థాయిలో ఎంఈడీ ఒకే ఏడాదిలో పూర్తిచేసే వీలుంటుంది.

31 వరకు అప్లికేషన్లు.. ఏప్రిల్​ 29న ఎంట్రన్స్ టెస్ట్

2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. ఆన్​లైన్​అప్లికేషన్లకు ఈనెల 16 వరకు గడువు ఉండగా, దానిని 31 వరకు పొడిగించారు. ఈ  టెస్ట్​ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో  పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మరో 13 భాషల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 29న ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 

సద్వినియోగం చేసుకోండి 

లక్సెట్టిపేట మోడల్​డిగ్రీ కాలేజీలో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్​డిగ్రీ కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఒకేసారి రెండు కోర్సులు పూర్తిచేసినట్లు అవుతుంది. కాలేజీలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. రాష్ట్రంలో కేవలం మూడు కాలేజీల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది.  డాక్టర్​ మహాత్మా సంతోష్, ప్రిన్సిపాల్