ఇంటర్ పరీక్షలకు రెడీ

ఇంటర్ పరీక్షలకు రెడీ
  •  మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు
  •  ఉమ్మడి జిల్లాలో 96 సెంటర్ల ఏర్పాటు  
  •  పరీక్షలకు హాజరుకానున్న 54,607 విద్యార్థులు 
  •  ఓటీపీతో హాల్​ టికెట్ డౌన్​లోడ్.. విద్యార్థులకు తప్పనున్న యాజమాన్యాల వేధింపులు

ఆదిలాబాద్, వెలుగు : ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధన వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. 

విద్యార్థులు గంట ముందుగానే ఎగ్జామ్​సెంటర్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికారులు పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. తాగునీరు, విద్యుత్, ఫర్నీచర్, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియెట్ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఇప్పటికే కలెక్టర్లు రివ్యూలు నిర్వహించి పలు సూచనలు చేశారు. 

పరీక్షలకు 54,607 మంది విద్యార్థులు

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలుపుకొని ఉమ్మడి జిల్లాలో మొత్తం 54,607 మంది విద్యార్థులున్నారు. మొత్తం 96 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలు, సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్​ జిల్లాలో ఫస్టియర్ జనరల్​విద్యార్థులు 8093 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1013 మంది, సెకండియర్​లో జనరల్​లో 8754, ఒకేషన్​లో 1020 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్టియర్​లో 4,965 మంది జనరల్, 935 ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. సెకండియర్​లో 5,625 మంది జనరల్, 1015 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నిర్మల్ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్టియర్ లో జనరల్, ఒకేషనల్​ విద్యార్థులు 6, 571 మంది, సెకండియర్​లో 6562 మంది విద్యార్థులున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్టియర్​లో 4,758 మంది, సెకండియర్​లో 5,296 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.

సదుపాయాలపై ఫోకస్

పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రూరల్ విద్యార్థులకు ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా వారికి వీలుగా బస్సులు నడిపించాలని సూచించారు. ఎగ్జామ్ జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, వేసవి నేపథ్యంలో ఉక్కపోత సమస్య అధిగమించేలా గదుల్లోని అన్ని ఫ్యాన్లు పనిచేసేలా రిపేర్లు చేపట్టారు.

సెంటర్ల వద్ద వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు పెట్టాలని.. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పరీక్ష కేంద్రాల వద్ద ఉండి ఫస్టెయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు.  

క్యూఆర్​ కోడ్​తో సెంటర్​ లొకేషన్, వివరాలు

పరీక్షల సమయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తూ హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుంటాయి. దీంతో పలువురు విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు షాక్ ఇస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్లకు ఓటీపీ పంపనున్నారు. 

ఈ ఓటీపీ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఇంటర్​ బోర్డు మొదటిసారిగా హాల్ టికెట్​పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఈ కోడ్​ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం వివరాలు, లొకేషన్ కనిపిస్తాయి.