పులుల రక్షణ మన బాధ్యత.. నేడు ఇంటర్నేషనల్ ​టైగర్​ డే

జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారిక సంస్థ(ఎన్​టీసీఏ), భారత అటవీ నిర్వాహణ సంస్థ(ఐఐఎఫ్ఎం) సంయుక్తంగా నాలుగేళ్లకోసారి 53 పులుల అభయారణ్యాల్లో నిర్వహిస్తున్న అఖిల భారత పులుల గణన-2022 నివేదిక ప్రకారం భారత్ లో పులుల సంఖ్య పెరిగింది. మొదటిసారిగా 2006లో చేపట్టిన పులుల గణన నివేదిక ప్రకారం.. మనదేశంలో 1411 పులులు ఉండగా ప్రస్తుత నివేదిక ప్రకారం 3,167 పులులు ఉన్నాయి.2018లో పులుల గణన నివేదిక ప్రకారం 2,967 పులులు ఉంటే.. తాజా నివేదిక ప్రకారం 200 పెరిగాయి. భారతదేశంలో పులుల సంరక్షణ అభయారణ్యాలను శివాలిక్ కొండలు గంగ మైదానం, మధ్య భారతదేశం తూర్పు కనుమలు, ఈశాన్య పర్వతాలు బ్రహ్మపుత్ర మైదానాలు, సుందర బన్స్ మైదానాలు, పశ్చిమ కనుమలు అనే ఐదు భాగాలుగా ఏర్పరిచారు. ఈ ఐదు ప్రాంతాలు 53 పులుల అభయారణ్యాలకు ఆలవాలంగా మారి పెద్దపులికి రక్షణగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ టైగర్50ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ‘అమృత్ కాల్ కా టైగర్ విజన్’ అనే ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ల చరిత్ర బుక్ లెట్, అఖిల భారత పులుల నివేదికను విడుదల చేస్తూ వాటి సంరక్షణ ద్వారా భారత్ ప్రకృతి సమతుల్యత సాధించిందని ఇది ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు ఇండియాలో ఉండటం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమం సాధించిన విజయానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.

రాష్ట్రంలో టైగర్​ భద్రత ప్రశ్నార్థకం

రాష్ట్రంలో ప్రస్తుతం కవ్వాల్, అమ్రాబాద్ రెండు పులుల అభయారణ్యాలు ఉన్నాయి. అఖిలభారత పులుల గణన-2018 ప్రకారం ఈ రెండు టైగర్ రిజర్వులలో 26 వరకు పులులు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 30 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పెద్దపులి జాతికి ముప్పు వచ్చింది. వాటిని వెంటాడి వేటాడి సొమ్ము చేసుకునే వారితో పెద్దపులుల సంఖ్య తగ్గిపోతున్నది. అలాగే విద్యుత్ తీగల కుచ్చులకు బలవడంతోపాటు విషం పెట్టి చంపేస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వాల్గొండ అడవి ప్రాంతంలో 2020లో చంపేసిన పులి చర్మాన్ని 2021లో కాగజ్ నగర్ లో విక్రయిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరి అటవీ ప్రాంతంలో ఎడాదిన్నర క్రితం పెద్దపులిని చంపినట్లు అధికారులు ధ్రువీకరించారు. నిరంతరం ట్రాకింగ్ ట్రాప్ కెమెరాలు పాదముద్రలతో పులి ఉనికిని చెప్పే అధికారులు.. మృత్యువాత పడుతున్న పులుల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు వహిస్తే ఈ రెండు అభయారణ్యాల్లో పులుల సంఖ్య పెరుగుతుంది. లేదంటే వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది.

జీవవైవిద్యానికి ఆవాసం...

పెద్దపులి అటవీ ఆవరణ వ్యవస్థలో సహకార జంతువుల సంఖ్యను సమతుల్యతలో ఉంచుతుంది. పులి తన ఆధీన ప్రాంతంలోని సకల జీవరాసుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతుంది. పులులను కాపాడటం అంటే అడవులను అందులోని జీవరాసులను, జీవవైవిధ్యాన్ని కాపాడటమే అవుతుంది. పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అభయారణ్యాల వల్ల కలిగే ప్రయోజనాల విలువ భారత అటవీ నిర్వాహణ సంస్థ 2019లో లెక్కగట్టింది. ఈ అధ్యయనం ప్రకారం10 పులుల అభయారణ్యాల్లో   ప్రతి ఏడాది 6 లక్షల కోట్ల ప్రయోజనాలు చేకూరుతున్నట్లు తెలిపింది. టైగర్ రిజర్వుల వల్ల ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు కలప కలపేతర ఉత్పత్తుల నుంచి ఆదాయం వస్తుంది. కర్బన నిక్షిప్తీకరణ, మంచినీటి సరఫరా, శీతోష్ణస్థితిని అదుపులో ఉంచడం వంటివి కంటికి కనిపించని లాభాలు. జీవవైవిద్యానికి ఆలవాలంగా మారిన పెద్దపులిని సంరక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది.

అటవీ ఆవరణ వ్యవస్థలో పెద్ద పులులు జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. నడకలో రాజసం.. చూపులో గాంభీర్యం ఉండే పెద్దపులి ఆవాసంలోని అన్ని జీవరాసుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్నది. ప్రకృతి సమతుల్యతకు పులులెంత విలువైనవో తెలుసుకున్న భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న మొదలుపెట్టిన టైగర్ ప్రాజెక్టు వల్ల పులుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నది. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థలను ప్రోత్సహించి పులి సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అందుకోసం ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరపాలని తీర్మానం చేశారు. ఏటా సంరక్షణ దినం జరుపుకునే భారతావని పులుల రక్షణకు అవలంబిస్తున్న ప్రత్యేక విధానాల వల్ల ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది.

- అంకం నరేష్,సోషల్ ​ఎనలిస్ట్