నిషేధిత జాబితాలోని అసైన్డ్ ​భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి

 నిషేధిత జాబితాలోని అసైన్డ్ ​భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం నందిగామలో నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్​ భూములకు గత ప్రభుత్వం చేసిన రిజిస్ర్టేషన్లను రద్దు చేయాలని ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి కలెక్టర్​ను కోరారు. బుధవారం అన్ని ఆధారాలతో కలెక్టర్​ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పటాన్​చెరులో ఆయన మాట్లాడుతూ నందిగామ సర్వే నంబర్ 213 లోని ఐదు ఎకరాల అసైన్డ్​ భూములను 2020 లో అక్రమంగా రిజిస్ర్టర్ చేసుకున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్​ సోదరుడు అరుణ్​కుమార్, అతడి స్నేహితుల పేరుపై నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపులు చేశారని, బీఆర్​ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అసైన్డ్​ చట్టం 1977 ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా రిజిస్ర్టర్ చేశారని ఆయన అధికారులను ప్రశ్నించారు.

స్థానిక బీసీలకు చెందిన అసైన్డ్ భూములను రాజకీయ పలుకుబడితో కాజేశారని, బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నందిగామ భూముల విషయంలో ఈనెల 18 న హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని వెంటనే అక్రమ రిజిస్ర్టేషన్లు రద్దు చేయాలని కోరారు. గతంలో భూములను అనుభవించిన రైతులకే తిరిగి హక్కులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.