పాలమూరును చూపుతూ 40 వేల ఎకరాలు పడావు పెట్టిన్రు!

పాలమూరును చూపుతూ  40 వేల ఎకరాలు పడావు పెట్టిన్రు!
  • ‘పాలమూరు’ ను చూపుతూ  40 వేల ఎకరాలు పడావు పెట్టిన్రు!
  • కృష్ణా, భీమా నదులపై ఉన్న  మినీ లిఫ్టులపై తీవ్ర నిర్లక్ష్యం 
  • గత సర్కారు ఫండ్స్​ ఇయ్యక మూలకుపడ్డయ్​ 
  • మోటార్లు తుప్పు పట్టి, పూడుకుపోయిన కాల్వలు 
  • సాగునీరందక ఎండుతున్న పంటలు

మహబూబ్​నగర్​, వెలుగు:  ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా​సస్యశ్యామలం కావాలంటే ‘పాలమూరు– రంగారెడ్డి’ ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం అని చెప్తూ వచ్చిన నాటి బీఆర్ఎస్​ సర్కారు, దాని పేరుతో అప్పటికే కృష్ణా, భీమా నదులపై నిర్మించిన మినీ లిఫ్టులను అటకెక్కించింది. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో తెలంగాణ ఏర్పాటయ్యాక ఏకంగా 14 లిఫ్టులు మూలకుపడ్డాయి. మోటర్లు తుప్పుపట్టగా, కాల్వలన్నీ పూడుకుపోయాయి. ఫలితంగా ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందక పాలమూరు జిల్లాలో 40 వేల ఎకరాలు పడావుపడ్డాయి.

మూలనపడ్డ మినీ లిఫ్టులు

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని మక్తల్, చిన్నచింతకుంట, నర్వ, ఊట్కూరు, మాగనూరు, కృష్ణా మండలాలకు సాగునీటిని అందించేందుకు 1984 నుంచి 2004 వరకు అప్పటి ప్రభుత్వాలు మినీ లిఫ్టులను ఏర్పాటు చేశాయి. కృష్ణా, భీమా నదుల ఆధారంగా కలహల్లి, హిందూపూర్​, గుడ్డెబల్లూర్​ ఫేజ్​–1, గుడ్డెబల్లూర్​ ఫేజ్–​-2, మురహార్ ​దొడ్డి ఫేజ్​-1, మురహార్​దొడ్డి ఫేజ్​–2, ముడుమాల్–1, ముడుమాల్​–2, పుంజనూరు, కురుమూర్తి రాయ, పస్పుల, ముస్లాయిపల్లి-1, ముస్లాయిపల్లి-2, కొండదొడ్డి మినీ స్కీములను నిర్మించాయి.

వీటి కింద దాదాపు 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందేది. స్కీములను ప్రారంభించిన మొదట్లో ప్రభుత్వాలే మెయింటెయిన్ ​చేసేవి. తర్వాత రైతు కమిటీలను ఏర్పాటు చేసి మెయింటనెన్స్​ బాధ్యతలను అప్పగించారు. అయితే, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఈ స్కీములపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రతి రెండేండ్లకోసారి రైతు కమిటీలను నియమించాల్సి ఉన్నా, కొత్త కమిటీలను ఎన్నుకోలేదు. కొన్ని చోట్ల కమిటీల నియామకంలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో రైతులు కూడా కమిటీలో ఉండేందుకు ముందుకు రాలేదు. దీంతో హిందూపూర్​, గుడ్డెబల్లూరు ఫేజ్​–-1, మురహార్​దొడ్డి మినీ స్కీములు తప్ప.. ఏడేండ్లుగా మిగిలిన స్కీములు ఏవీ రన్నింగ్​లో లేవు. వీటి కింద ఉన్న ఆయకట్టు రైతులు కేవలం వానాకాలం సీజన్​లోనే వర్షాధారంగా కందులు, వరి సాగు చేసుకుంటున్నారు. యాసంగిలో సాగునీరందక దాదాపు 40 వేల ఎకరాలను పడావు పెడుతున్నారు.

పీఆర్ఎల్ఐ కాల్వ నీళ్లు ఇస్తామని చెప్పి..

2016లో పాలమూరు-–-రంగారెడ్డి స్కీం పనులను ప్రారంభించిన గత ప్రభుత్వం మూడేండ్లలో పనులు కంప్లీట్ ​చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని ప్రకటించింది. ఈ స్కీములో భాగమైన కర్వెన, ఉదండాపూర్​ రిజర్వాయర్ల నుంచి నారాయణపేట, మక్తల్​, కొడంగల్​ నియోజకవర్గాలకు కాల్వల ద్వారా సాగునీటిని అందిస్తామని చెప్పింది. దాదాపు రెండేండ్ల కింద అప్పటి నారాయణపేట కలెక్టర్​ ఆధ్వర్యంలో కాల్వ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మెజార్టీ ప్రజలు అంగీకారం కూడా తెలిపారు. కానీ, ఇంత వరకు కాల్వల పనులు పట్టాలెక్కలేదు. టెండర్ల దశ కూడా దాటలేదు. ఇప్పటి వరకు కాల్వ నిర్మాణాలకు భూ సేకరణ కూడా జరగలేదు. గతంలో భూమి సేకరించేందుకు ఆఫీసర్లు ప్రయత్నించగా, రైతులు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడతో ఇష్యూ అక్కడితోనే ఆగిపోయింది.

తుప్పు పట్టిన మోటార్లు

ఏండ్లుగా ఈ స్కీములు రన్నింగ్​లో లేకపోకవడంతో మోటార్లు తుప్పు పట్టాయి. కొన్ని స్కీముల్లో ఏర్పాటు చేసిన మోటార్లు కాలిపోయినా ఇప్పటి వరకు రిపేర్లు చేయించలేదు. చిన్న చిన్న పనులకు కూడా బీఆర్​ఎస్​ సర్కారు ఫండ్స్​ ఇవ్వకపోవడంతో మోటార్లు, పైపులు, ఇతర ఎలక్ట్రితతతతతకల్ పరికరాలు దెబ్బతిన్నాయి. కొన్ని స్కీముల కింద మోటార్లు బాగానే ఉన్నా, వాటిని రన్​ చేయకుండా బంద్​ పెట్టారు. ముఖ్యంగా స్కీముల పరిధిలో ఉన్న కాల్వలు అధ్వానంగా మారాయి. మెయిం​టెనెన్స్​ లేక ఎక్కడికక్కడ ఖరాబయ్యాయి. కంప చెట్లతో నిండిపోయాయి. రివిట్​మెంట్ ​లేకపోవడంతో కోసుకుపోయాయి.

ఫండ్స్​ తెస్తామని మోసం చేసిన్రు

కురుమూర్తి రాయ లిఫ్ట్​ కింద నాలుగు గ్రామాలకు సాగు, తాగునీరందేది. లిఫ్ట్​బంద్​కావడంతో ఈ నాలుగు ఊళ్లల్లో గ్రౌండ్​వాటర్ ​తగ్గిపోయింది. పంటల సాగుకు తిప్పలైతున్నయ్. లిఫ్ట్​లో మోటార్లు పని చేస్తున్నా.. గత సర్కారు నిర్లక్ష్యం వల్ల రన్​ చేయలేదు. గత పాలకులు కూడా స్కీమ్​ను రన్ చేసేందుకు ఫండ్స్​తీసుకొస్తామని చెప్పి మోసం చేసిండ్రు.
- రాముల, రైతు, దుప్పల్లి గ్రామం

పదేండ్లుగా నడుస్తలేవు..

పదేండ్లుగా లిఫ్టులు నడుస్తలేవు. లిఫ్టుల కింద భూములకు సాగునీరందడం లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలకు, ఇరిగేషన్​ ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు.
- బలరాం రెడ్డి , రైతు, సంగంబండ గ్రామం