
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం.. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV D2 రాకెట్ ప్రయోగించబడింది. 2022 ఆగస్టు 7న ఇస్రో ప్రయోగాత్మకంగా నిర్మించి ప్రయోగించిన SSLV D1 రాకెట్ సాంకేతిక కారణాలతో విఫలమైంది. ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయింది. తాజాగా లోపాల్ని సరిదిద్ది ఎSSLV D2 రాకెట్ రూపొందించి ప్రయోగించారు.
SSLV D2 రాకెట్ మొత్తం పొడవు 34 మీటర్లు, వెడల్పు2 మీటర్లు, బరువు 119 టన్నులు. 450 కిలో మీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో 156.3 కిలోల బరువున్న ఈవోఎస్-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీ శాట్ 02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానుస్-01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోనుంది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధించింది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన EOS 07 ఉపగ్రహంతో పాటు మరో రెండు నానో ఉపగ్రహాలను నింగిలోకి ఇస్రో పంపింది. అటు మార్చి నెలలో LVM..3 రాకెట్ ప్రయోగం ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నెలలో మరో SSLVతో పాటు మే నెలలో గగన్ యాన్ ప్రయోగాత్మక లాంచ్ ఉండబోతున్నట్టు ఇస్రో తెలిపింది.