- ‘ఎన్ వీఎస్2’లో తెరుచుకోని లిక్విడ్ ఇంజన్ వాల్వులు
- దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరుగుతున్న ఉపగ్రహం
న్యూఢిల్లీ: ఇస్రో బుధవారం ఉదయం శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి పంపిన ఎన్ వీఎస్2 ఉపగ్రహంలో టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఉపగ్రహంలోని లిక్విడ్ ఇంజన్ వాల్వులు తెరుచుకోకపోవడంతో ఇంజన్ ను మండించి, శాటిలైట్ కక్ష్యను పెంచడం సాధ్యం కావడం లేదని ఇస్రో ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు, అతిదూరంగా 36,577 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఎన్ వీఎస్2 తిరుగుతోందని తెలిపింది.
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ కూటమిలోకి ఈ ఉపగ్రహాన్ని ఇస్రో పంపింది. అయితే, నావిక్ లోని ఉపగ్రహాలు 35 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలోనే తిరుగుతూ, భారత భూభాగంపై నిర్దేశిత ప్రాంతంపైనే ఎల్లప్పుడూ ఉంటేనే నావిగేషన్ సేవలను సమర్థంగా అందించగలుగుతాయి. ప్రస్తుతం ఎన్ వీఎస్2 ఉపగ్రహంలో అన్ని పరికరాలు పని చేస్తున్నాయని, కానీ ఇంజన్ వాల్వుల్లో లోపం వల్లే ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపడం కష్టమవుతోందని ఇస్రో పేర్కొంది.
సమస్యను పరిష్కరించేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారని, ఈ సమస్య పరిష్కారం కాకపోతే.. ప్రస్తుత కక్ష్యలో నుంచే ఆ ఉపగ్రహ సేవలను వినియోగించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపింది. కాగా, నావిక్ వ్యవస్థలోకి 2013 నుంచి ఇప్పటిదాకా 11 ఉపగ్రహాలను ఇస్రో పంపింది. అయితే, వీటిలో 6 ఉపగ్రహాలు వివిధ కారణాల వల్ల పూర్తిగా లేదా పాక్షికంగా ఫెయిల్ అయ్యాయి.