చరిత్రను మరవడం  మంచిది కాదు

“ఏ జాతి అయినా తన ఘనమైన చరిత్రను విస్మరిస్తే ఆ జాతి అస్థిత్వం కోల్పోక తప్పదు’’ ఓ ప్రముఖ తత్వవేత్త అన్న ఈ మాట తెలంగాణ ప్రజలకు అతికేలా ఇక్కడి పాలకులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల అసలు చరిత్రను అధఃపాతాళంలోకి తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ‘సెప్టెంబర్ 17 విమోచన దినం’ను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఆ ఉత్సవాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యను తెలంగాణ విమోచన దినం ఎందుకు జరపడం లేదని ఉద్యమ సమయంలో కేసీఆర్​ నిలదీశారు. మరి ప్రత్యేక తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరెందుకు తెలంగాణ విమోచన దినం జరపడం లేదు? అని ప్రజలు ఇప్పుడు కేసీఆర్​ను నిలదీస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినం జరపాలని కేసీఆర్​ ఆనాడు ఉపన్యాసాలు దంచారు. కర్నాటక, మహారాష్ట్ర బడ్జెట్ కేటాయించి మరీ సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరుపుతుంటే మీరెందుకు జరపరని, ప్రత్యేక తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగరేస్తామని కూడా ప్రకటించారు. కానీ నేడు ఆ మాటలన్నిటినీ ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఆనాడు ఇక్కడి ప్రజల్లో జాతీయాభిమానం రేకెత్తించేలా మాట్లాడిన కేసీఆర్​ ఈ రోజు ఎవరి మెప్పు కోసం మౌనం దాల్చారో తెలంగాణ ప్రజలు సులభంగా అర్థం చేసుకోగలరు. రజాకార్ల వారసుల పార్టీతో 'అలయ్ బలయ్' జరుపుకొంటూ ఆ అత్తరు వాసనలో ఇవన్నీ మర్చిపోయి ఉంటారు! వేల పుస్తకాలు చదివిన ఆయనకు చరిత్రను మరోసారి గుర్తు చేయాల్సి రావడం విడ్డూరం.
ఎన్నో పోరాటల ఫలితం
తెలంగాణను మహాభారత యుద్ధం తర్వాత మగధ పాలకులు, శుంగ, శిశునాగ, మౌర్యగుప్త వంశాలు పాలించాయి. ఆ తర్వాత శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన, బాదామి, వేములవాడ, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కుందూరి చోడులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డి, వెలమ, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు పాలించారు. రాజరిక వ్యవస్థలో చివరగా అసఫ్ జాహీలు పాలించారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911 నుంచి 1948 సెప్టెంబర్ 16 వరకు పాలించారు. విచిత్రం ఏమిటంటే నరహంతక కుటిల మనస్తత్వం గల నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ప్రీతిపాత్రం కావడం. మత ఖలీఫా రాజ్యం కోసం నిజాం సృష్టించిన రజాకార్లు తెలంగాణ ప్రాంతాన్ని హాహాకారాలు పెట్టించారు. బతుకమ్మల్లాంటి ఇక్కడి స్త్రీలపై అత్యాచారాలకు తెగబడ్డారు. అమాయకులైన ఇక్కడి ప్రజలపై దాడులు, దోపిడీలు, మతహింస, దుర్మార్గాలు, అకృత్యాలకు పాల్పడ్డారు. వరంగల్లులో నారాయణరెడ్డి లాంటి ప్రజా సేవకుడిని, జాతీయ జెండా ఎగరేసిన మొగిలయ్యగౌడను, ఇంటి ముందు కళ్లాపి చల్లడానికి పేడ తెచ్చేందుకు వెళ్లిన నక్కా ఆండాలమ్మను, తమ దుర్మార్గాలను ప్రశ్నించిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్​ను, ఆర్యసమాజంపై కాషాయ ధ్వజం నిలిపిన షహీద్ శ్యాంలాల్​ను దారుణంగా హత్య చేశారు. తిరగబడ్డ బైరాన్‌‌పల్లిని, పరకాలను రాక్షసుల వలె ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న నిజాం 1947 జులై 14న “ఉస్మానిస్తాన్’’ అంటూ స్వతంత్ర రాజ్యం ప్రకటించుకున్నాడు. ఆనాటి నుంచి ఇక్కడి హిందువులను క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోని 8 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలకు చెందిన ప్రజలు అకుంఠితమైన, అరవీర భయంకరమైన పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలు, మానాలు కోల్పోయారు. ఎందరో మహానుభావులు చేసిన పోరాటం వల్ల, బలిదానాల వల్ల, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ సాహసోపేత నిర్ణయంతోనూ ఉస్మాన్ అలీఖాన్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ విమోచనం పొందింది. ఇదంతా సంక్షిప్తంగా మన తెలంగాణ చరిత్ర.
నిజాం పంథా!
ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో విమోచన దినం జరపాలన్న కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక నిజాం సమాధిని దర్శించి తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేశారు. ఎప్పుడైతే నిజాం సమాధిని ఆయన దర్శించి వచ్చారో అప్పుడే ఉస్మాన్ అలీఖాన్ ఆత్మ ఆయనను ఆవహించింది అని చెప్పవచ్చు. ఎన్నో పరిణామాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చిన జిన్నా తన ముందు కూర్చున్నాడనే ఉక్రోషంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అతనిని వెనక్కి పంపించాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆయనను ధిక్కరించేవాళ్లకు ఉద్దేశపూర్వకంగా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. నిజాం ఎవ్వరికీ దర్శనం ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు కేసీఆర్ పై అవే ఆరోపణలు వస్తున్నాయి. నిజాం మాట మీద నిలబడేవాడు కాదు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కూడా సెప్టెంబర్-17 ఉత్సవాల విషయంలో అలాగే వ్యవహరిస్తున్నారు. నిజాం రజాకార్లకు కావాల్సిన మద్దతు ఇచ్చేవాడు, ఇప్పించేవాడు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కూడా రజాకార్ల వారసులైన మజ్లిస్ కు, ఓవైసీ బ్రదర్స్ కు రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్ అప్పగించారు.
విమోచన దినాన్ని ప్రభుత్వమే జరపాలె
ఇప్పటికైనా కళ్లు తెరవండి, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గమనించండి, అందుకు అనుగుణంగా నడుచుకోండి అని తెలంగాణ ప్రజలు ఇక్కడి పాలకులను కోరుతున్నారు. ‘సెప్టెంబర్ 17 విమోచన దినం’ ఉత్సవాలు ప్రభుత్వమే జరపాలని, ఇతరులు జరుపుతుంటే అడ్డు రావొద్దని కోరుతున్నారు. ఈ చరిత్రను ఎవరూ మార్చలేరు. దానిని అవగాహన చేసుకొని, భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటం పాలకుల బాధ్యత. కానీ చరిత్రను మార్చాలని చూడటం, ఎవరో ఒకరి స్వార్థం కోసం చరిత్రకు మసిబూసి మారేడుకాయ చేయాలనుకోవడం జాతి భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు అవుతుంది. నాడు మనదేశానికి స్వాతంత్ర్యం రాలేదు కాబట్టి.. మనలను కట్టుబానిసలను చేసి పాలించిన వారికి దాసోహం కావల్సి వచ్చింది. నేడు మనం స్వతంత్రులం. మనకంటూ ప్రత్యేక రాజ్యాంగం, పాలనా పద్ధతి నిర్మించుకున్నాం. మనదేశం అభివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. సెక్యులరిజంలో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాం. అందరినీ సమానంగా చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మళ్లీ మన పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల నెపంతో మత దురహంకారులకు వత్తాసు పలకడం, చరిత్రను విస్మరించడం సమంజసం కాదు. మనకంటూ స్వాభిమానం ఉంది. దానిని మనం నిలబెట్టుకోవాలి. రాజకీయాలలో అన్ని వర్గాలను, అందరినీ కలుపుకుపోవడం తప్పు కాదు. అందుకోసం జాతి భవిష్యత్తును విస్మరించరాదు. స్వాభిమానంతో బతుకుతూ, స్వాభిమానంతో నిలబడే జాతికి ఎప్పటికీ ఓటమి ఎదురుకాదు. అందుకు హిందూ జాతే ఉదాహరణ. ఆ విలువలను మన పాలకులు విస్మరించరాదు. ప్రజల ఆకాంక్షలను నిలబెట్టేవాడే నిజమైన పాలకుడు అని చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. దానిని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అకృత్యాలు ఆగలేదు
నిజాం అప్పుడప్పుడు హిందూ అధికారులపై, ప్రజలపై తన అక్కసు వెళ్లగక్కేవాడు. ఆ ఆదర్శాన్ని కూడా కేసీఆర్ కొనసాగిస్తూ కిందటి ఎన్నికల్లో ‘హిందుగాళ్లు-బొందుగాళ్లు’ అంటూ హిందువులపై నోరు పారేసుకున్నారు. రజాకార్లు అప్పంపల్లి, పరకాల, బైరాన్‌‌పల్లిలో చేసిన నరమేథం పట్ల నిజాం చూసీ చూడనట్లు వ్యవహరించాడు. నేడు భైంసాలో హిందూ కుటుంబాలపై దాడులు జరుగుతుంటే కేసీఆర్ కూడా అదే పంథా అవలంబిస్తున్నారు. భువనగిరి దగ్గర పురోహితులను రజాకార్లు చెట్టుకు వేలాడదీసి మంటల్లో వేసి కాల్చారు. ఇటీవల వరంగల్​లో గుడిలో మైక్ పెట్టిన సత్యనారాయణ అనే పూజారిని ఓ మతోన్మాది ఘోరంగా కొట్టి చంపాడు. నాడు ముక్కుపచ్చలారని నక్కా ఆండాలమ్మను రజాకార్ మతోన్మాదులు అత్యాచారం చేసి పూడ్చి పెడితే, నేడు చాదర్‌‌ఘాట్​లో ఎంఐఎం నాయకుడు దళిత బాలికను రేప్ చేశాడు. హిందువుల పట్ల జరిగిన ఇటువంటి ఘోర అకృత్యాల పట్ల నాటి నిజాం ఎలా స్పందించలేదో అలాగే నేటి కేసీఆర్ ప్రభుత్వం కూడా స్పందించటం లేదు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది హాయిగా జీవించాలనుకొన్న ఇక్కడి ప్రజల పట్ల నేటి పాలకుల వ్యవహారం మరో నిజాంను తలపిస్తున్నది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. దీనిని సామాన్య ప్రజలు సైతం ఒప్పుకుంటున్నారన్న మాటను ముఖ్యమంత్రి గమనించాలి.

హిందువుల మీదే ఆంక్షలు
నిజాం కాలంలో ముస్లిం పండుగలకు అనుమతి ఇచ్చి, హిందూ ఉత్సవాలపై భయంకర నిషేధాలు విధించేవారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నడుచుకుంటున్నారు. పోయిన సంవత్సరం కరోనాను బూచిగా చూపించి వినాయక ఉత్సవాలపై ఉక్కుపాదం మోపారు. ఈ సంవత్సరం కూడా అటువంటి పంథానే కొనసాగిస్తూ వినాయక మండప నిర్వాహకులను అరెస్టులు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నిమజ్జనం విషయంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. కానీ, బక్రీద్​ ఉత్సవాల పేరుతో గోవులను వధిస్తుంటే చూసీ చూడనట్లు ఊరుకున్నారు. అంటే ఆంక్షలూ హిందువుల మీదే, బలి తీసుకునేది హిందూ మనోభావాలనే. ఈ విషయాన్ని ఇక్కడి హిందువులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. నాటి విదేశీ నిజాం పాలనకూ, నేడు స్వదేశీ కేసీఆర్ పాలనకూ పెద్దగా తేడా లేదనే విషయాన్ని గుర్తిస్తున్నారు.

 

 - బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు