- ఏజెన్సీలో జాడలేని ఐటీడీఏ సమావేశాలు
- గిరిజన సమస్యలు, సంక్షేమంపై కనిపించని చర్చావేదిక
- నేటికీ అభివృద్ధికి దూరంగా గిరిజన గ్రామాలు
- రోడ్లు లేక, వైద్యం అందక అల్లాడుతున్న జనం
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవించే గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ వెనుకబడిపోయింది. వివిధ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదివాసీ, గిరిజనుల సమస్యలపై చర్చించడంలో కీలక పాత్ర పోషించే ఐటీడీఏ పాలక వర్గ సమావేశాలు ఐదేండ్లుగా జరగడంలేదు. మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులను సమీక్షించడం.. కొత్త పనులకు తీర్మానాలు చేయాల్సినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
గిరిజనుల సమస్యలపై చర్చా వేదిక జరగకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. చివరిసారిగా 2019 అక్టోబర్ లో పాలకవర్గ సమావేశం తర్వాత మళ్లీ జరగలేదు.
కీలకంగా వ్యవహరించే తీర్మానాలు
గిరిజనులకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా 1975 లో ఏర్పాటైన ఐటీడీఏ.. ఉమ్మడి జిల్లాలోని 44 ఏజెన్సీ మండలాల్లో 250 గ్రామ పంచాయతీల్లో విస్తరించి ఉంది. జిల్లా యంత్రాంగానికి సమానంగా పలు విభాగాలు ఐటీడీఏలో పనిచేస్తాయి. నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొనే పాలకవర్గ సమావేశంలో గిరిజనుల సమస్యలపై చర్చించి వారి అభివృద్ధికి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. గిరిజనులతో పాటు గిరిజనేతరుల సమస్యల పరిష్కారానికి పాలకవర్గం చేసే తీర్మాణాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
ఈ తీర్మానాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గిరిజనుల సంక్షేమం కోసం చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఐటీడీఏ పరిధిలో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఖర్చులు, గిరిజనుల సమస్యలపై మూడు నెలలకోసారి ఈ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐదేండ్లుగా పాలక మండలి సమావేశాలు లేకపోవడంతో గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
వెంటాడుతున్న సమస్యలు
సమావేశాలు లేకపోవడంతో ఏజెన్సీ గ్రామాల్లో రోడ్డు, వంతెనలు ఏర్పాటు కావడంలేదు. దీంతో గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరంగానే జీవించాల్సి వస్తోంది. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రహదారులు అభివృద్ధి చేయాల్సినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఎమర్జెన్సీ సమయాల్లో వైద్యం కోసం వెళ్లే వారు వంతెనలు, వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు.
ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు, రక్తహీనత సమస్య వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా పోడు పట్టాల సమస్యతో ఎంతో మంది ఆదివాసీలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో గడువు ప్రకారం సమావేశాలు నిర్వహిస్తుంటే.. ఐటీడీఏలో మాత్రం పాలకవర్గం సమావేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనాచొరవ తీసుకొని ఐటీడీఏ పాలకవర్గం ఏర్పాటుతో పాటు సమావేశం నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.
అభివృద్ధి కుంటుపడింది
ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఐటీడీఏ పాలక మండలి సమావేశం ఐదేండ్లుగా జరగకపోవడంతో ప్రజల సమస్యలు చర్చకు రావడం లేదు. గిరిజనులు అభివద్ధికి నోచుకోవడంలేదు. నిత్యం వైద్యం కోసం గిరిజనులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఐటీడీఏకు నిధులు ఏ మేర వస్తున్నాయి.. ఎంత ఖర్చు చేస్తున్నారనే వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.
ఐటీడీఏలు బలోపేతం కావాలంటే రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహించాలి.- పూసం సచిన్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి