- స్టూడెంట్స్‌కు ఐటీడీఏ పీవో రాహుల్ సూచన
భద్రాచలం, వెలుగు : చదువుతో పాటు పర్యావరణంపై స్టూడెంట్లు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. బీఎడ్ కాలేజీలో బుధవారం స్టూడెంట్లకు సబ్బులు, ఇతర ద్రవాల తయారీపై నిర్వహించిన వర్క్ షాపులో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా స్టూడెంట్లు అర్థం చేసుకుని పర్యావరణానికి హాని కలగకుండా చూడాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ప్రకృతి పరంగా ఎదురైన సమస్యలను పరిష్కరించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
మానవుని వికృత చేష్టలు, స్వార్ధం వల్ల ప్రకృతికి తీవ్ర విఘాతం ఏర్పడి వాతావరణం రుతువుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్బులు, హ్యాండ్ వాష్ లిక్విడ్, డిష్‌వాష్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో అవగాహన కల్పించారు. అనంతరం స్టూడెంట్లకు టీషర్టులు, టోపీలు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.