రాజకీయాల కోసం గురుకులాలపై ఆరోపణలా?

  • వీలైతే విద్యార్థుల భవిష్యత్తుకు సలహాలివ్వండి: గురుకుల జేఏసీ

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల కోసం గురుకులాలపై ఆరోపణలు చేయడమేంటని గురుకుల ఉద్యోగుల జేఏసీ మండిపడింది. వీలైతే గురుకులాల్లో చదువుతున్న  6 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యతుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. శనివారం నాగోల్ లోని గురుకుల జేఏసీ కేంద్ర కార్యాలయంలో  జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి నారాయణ, మధుసూదన్ మీడియాతో మాట్లాడారు. గురుకులాలపై రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 

గత పదేండ్లలో  గురుకులాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎం సమగ్ర విచారణ జరిపించాలని, జేఏసీ తరుఫున ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. రేవంత్ సర్కార్ చొరవతోనే  గురుకులాల్లో 9వేలకు పైగా కొత్త నియామకాలు జరిగాయని, 3 వేల మందికి ప్రమోషన్లు, 4 వేల మందికి బదిలీలు జరిగాయని గుర్తుచేశారు. జనార్దన్, నరసింహులు గౌడ్, గణేశ్, భిక్షం యాదవ్  పాల్గొన్నారు.