
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలోని లక్ష్మి గార్డెన్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలను తరలించేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. పార్టీ పెట్టినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు బీఆర్ఎస్ ఉండదని, మధ్యలోనే బంద్ అవుతుందని శాపనార్థాలు పెట్టారని చెప్పారు.
మొదటి వార్షికోత్సవ సభ నల్గొండ జిల్లాలో పెట్టి సూపర్ సక్సెస్ చేశామని గుర్తుచేశారు. ఎన్నో మైలురాళ్లు, ఎందరో రాక్షసులను తరిమికొట్టిన ఘనత బీఆర్ఎస్ కు ఉందన్నారు. జిల్లా మంత్రుల చేతగాని తనం వల్ల రైతులపై మిల్లర్లు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో ధాన్యం రాశులకు రైతు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఎస్ఎల్ జిల్లాను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.