జగిత్యాల జేఎన్టీయూలో పురుగులన్నం...పస్తు పడుకున్న స్టూడెంట్లు

కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూలో అన్నంలో పురుగులు రావడంతో స్టూడెంట్లు భోజనం చేయకుండా పస్తు పడుకున్నారు. సమ్మర్​హాలీడేస్​ తర్వాత హాస్టల్​ప్రారంభమై వారం అవుతోంది. సుమారు 200 మంది విద్యార్థులు ఇండ్ల నుంచి ఈ మధ్యే వచ్చారు. 

సోమవారం రాత్రి బాయ్స్​హాస్టల్ లో మీల్​మేకర్​కర్రీ వండి భోజనం పెట్టారు. అందులో జిర్ర పురుగు కనిపించడంతో అంతా భోజనం చేయకుండానే వెళ్లి పడుకున్నారు. తెల్లారిన తర్వాత మంగళవారం కొందరు స్టూడెంట్లు హాస్టల్ మేనేజర్ ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మెస్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు రావడం నిజమేనని మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెస్ కాంట్రాక్టర్ కు మెమో ఇచ్చినట్లు  తెలిపారు.