- ఇండెంట్ పెట్టకపోవడంతో మెడిసిన్ కొరత
- శానిటేషన్ నిర్వహణలోనూ ఫెయిల్
- ఇటీవల సూపరింటెండెంట్ ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
- సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన కలెక్టర్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల సర్కారు దవాఖాన సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే మెడిసిన్ కొరత వేధిస్తుండగా.. ప్రభుత్వం సరఫరా చేయని మెడిసిన్ కోసం ఇండెంట్ పెట్టడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. రోజూ కనీసం 600 మంది ఔట్ పేషెంట్లు వచ్చే జిల్లా ఆసుపత్రిలో మెడిసిన్ల కొరతతో పాటు డాక్టర్లు టైంకు రాకపోవడం, పారిశుద్ధ్య లోపం, ఎక్పైర్ అయిన మెడిసిన్ పేషెంట్లకు వాడటం లాంటి వివాదాలు నెలకొన్నాయి.
కలెక్టర్ ఆమోదం తెలిపినా చర్యలు శూన్యం..
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సరఫరా లేని మెడిసిన్ ను టెండర్ ద్వారా కొనుగోలు చేసే వీలు ఉంది. రోగులకు అవసరం ఉన్న మందులను కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 28న కలెక్టర్ ఆమోదం తెలిపినప్పటికీ సూపరింటెండెంట్ రాములు నిర్లక్ష్యం వహించారు. రోగులకు అందించాల్సిన ఆహారం కోసం వేసిన కాంట్రాక్ట్ గడువు సెప్టెంబర్ 28న ముగిసింది. ఈ విషయం రెండు నెలలు గడిచినా పట్టించుకోలేదు.
జడ్పీ సమావేశాలకు హాజరు కాకపోవడం.. సెలవులు మంజూరు కాకపోయినా గైర్హాజరు కావడం, ఆస్పత్రి పరిశుభ్రంగా లేకపోవడం.. వాష్ రూంలు అధ్వానంగా మారిన పట్టించుకోకపోవడంతో ఏకంగా రోగులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంక్వయిరీ చేపట్టిన ఉన్నతాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములును 2024 డిసెంబర్ 19న తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సరెండర్ చేశారు. ఆసుపత్రికి ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా సుమన్ రావును నియమించారు.
రూ. 85 లక్షలతో అభివృద్ది పనులు
రోగులకు మెరుగైన సేవలు అందించేలా కలెక్టర్ సత్య ప్రసాద్ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 2న జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సుమన్ రావు, అధికారులతో రూ. 85 లక్షల అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆసుపత్రిలో శానిటేషన్ పనులు, కలర్స్ నెలలో కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ వార్డుల్లో ఆక్సిజన్ పైప్ లైన్స్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన చోట సిబ్బంది మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.