మరణించిన తొమ్మిదేండ్ల తర్వాత యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డులు మంజూరు

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి, ముత్యంపేటకు చెందిన మరో వ్యక్తికి వారు మరణించిన తొమ్మిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం యూనిక్  డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు మంజూరు చేసింది. ఆ కార్డులు పోస్టులో రావడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన జక్కుల అంజయ్య పక్షవాతంతో  బాధపడుతూ 12 సంవత్సరాల క్రితం సదరన్  క్యాంపుకు వెళ్లి సదరన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

 ఆయన అప్లికేషన్  పెట్టుకున్న పుష్కర కాలానికి యూనిట్  డిజిటల్  ఐడెంటిటీ కార్డు పోస్టు ద్వారా వచ్చింది. అయితే, అంజయ్య చనిపోయి తొమిది సంవత్సరాలు అయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడే సదరన్  సర్టిఫికెట్  వచ్చి ఉంటే ఆయనకు దివ్యాంగుల పింఛను వచ్చేదని చెప్పారు. కాగా, వారం రోజుల క్రితం ముత్యంపేట గ్రామానికి చెందిన మర్రి గంగరాజు అనే వ్యక్తికి కూడా మరణించిన తొమ్మిదిన్నర సంవత్సరాలకు యూనిక్  డిజిటల్  ఐడెంటిటీ కార్డు రావడం గమనార్హం.