
- ఓపెన్ ఆక్షన్ అమలుపై మామిడి రైతుల ఆశలు
- జగిత్యాల జిల్లాలో ఏటా 35 వేల ఎకరాల్లో మామిడి సాగు
- దళారుల మోసంతో డిమాండ్ ఉన్నప్పటికీ నష్టాల్లోనే మామిడి రైతులు
- ఓపెన్ మార్కెట్ నిర్వహించాలని సర్కార్ కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలోని చల్‌గల్ మ్యాంగో మార్కెట్‌లో ఏటా రూ.వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. కానీ ఈ బిజినెస్ అంతా దళారుల చేతుల్లో ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడంలేదు. ఇతర రాష్ట్రాల్లో అత్యధిక ధర పలికే మామిడి.. చల్‌గల్ మార్కెట్‌లో మాత్రం చతికిలపడుతుంటుంది.
ఇందుకు దళారుల సిండికేట్ మాయజాలమే కారణమనేది బహిరంగ రహస్యం. మార్కెట్‌లో రూల్స్ ప్రకారం ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తే మామిడి రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఈక్రమంలో మార్కెట్‌లో ఓపెన్ ఆక్షన్ నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈ ఏడాది మామిడికి తేనే మంచు పురుగు, బ్లాక్ ట్రిప్, మచ్చలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
విదేశాలకు జగిత్యాల మామిడి..
జిల్లాలో సుమారు 35 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. ఈ మామిడికి దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. చల్‌గల్ మార్కెట్ నుంచి నాగపూర్, ముంబై, ఢిల్లీకి ఎగుమతి అవుతుంది. అక్కడ నుంచి ప్రత్యేకంగా ప్యాక్ చేసి విదేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. విదేశాలకు ఎగుమతి అయ్యే వాటిలో బంగినపల్లి, చెరకు రసాలు, మల్గొబా వంటి రకాలు ప్రధానంగా ఉన్నాయి. ఇంత క్రేజ్ ఉన్న జగిత్యాల మామిడి పండ్ల కు బహిరంగ మార్కెట్లో మంచి ధర పలుకుతున్నప్పటికీ వాటిని పండించిన రైతులు మాత్రం గిట్టుబాటు ధర లేక దిగాలు చెందుతున్నారు.
గతేడాది మార్కెట్ ప్రారంభ దశలో టన్నుకు 60వేల నుంచి రూ.80వేలు పలకగా.. చివరి దశలో అది రూ.20 నుంచి 50వేల మధ్యనే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరో రెండు, మూడు రోజుల్లో చల్‌గల్ మార్కెట్‌ను ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తేనే తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.
అంతా సిండికేట్.. పెరగని ధర
చల్‌గల్ మార్కెట్‌లో కమిషన్ ఏజెంట్లు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తారనే ఆరోపణలున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. వాస్తవానికి ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తే కాయను బట్టి ధర పలుకుతుంది. దీంతో క్వాలిటీ సరుకు తెచ్చిన రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కానీ సిండికేట్ గా మారిన కమీషన్ ఏజెంట్లు నాణ్యత, గ్రేడ్ వంటి పేర్లు చెప్పి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా కొనుగోలు చేసిన మామిడిని.. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చల్‌గల్ మార్కెట్‌లో ఓపెన్ మార్కెటింగ్ నిర్వహించాలని రెడ్డి రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
ఓపెన్ మార్కెట్ ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ నెల 12 తర్వాత మామిడి మార్కెట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరెంట్, నీటి వసతి కూడా ఏర్పాటు చేశాం. ఈ ఏడాది కూడా మామిడి కొనుగోళ్ల కోసం ఓపెన్ ఆక్షన్ (బహిరంగ వేలం) కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. కమీషన్ ఏజెంట్లకు రూల్స్ వివరించాం. - రాజశేఖర్, చల్‌గల్ మార్కెట్ కమిటీ సెక్రటరీ