తండ్రిని చంపిన కేసులో కొడుకు అరెస్టు : జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్

 తండ్రిని చంపిన కేసులో కొడుకు అరెస్టు :  జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్
  • మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వివరాలు వెల్లడించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ 

జైపూర్, వెలుగు:  తండ్రిని చంపిన కేసులో కొడుకుతో పాటు అతడికి సహకరించిన ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..  జైపూర్ మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య  (45) ఆటో నడుపుతూ అతని భార్య , కొడుకుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఏడేండ్ల నుంచి రాజయ్య  భార్యతో గొడవలు పడుతున్నాడు. పది రోజుల క్రితం భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో  రాజయ్య భార్యను కొట్టి కొడుకును చంపేస్తానని బెదిరించాడు.

 దీంతో ఎప్పటికైనా తండ్రితో ప్రమాదం అని భావించినా కొడుకు సాయి సిద్ధార్థ్ ఇద్దరు మిత్రులతో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ వేశాడు.   గురువారం రాత్రి సాయి సిద్ధార్థ్ ఇద్దరు స్నేహితులతో కలిసి  తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. 

స్నేహితుల సాయంతో తండ్రి రాజయ్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ముగ్గురు ఆటోలో పారిపోయారు. రాజయ్యను హత్య చేసిన కొడుకు సాయి సిద్దార్థతో పాటు శ్రీరాంపూర్ లోని అరుణక్క నగర్ కు చెందిన జలంపల్లి సందీప్ ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు టూ వీలర్స్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.