- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై గెలుపు
హైదరాబాద్, వెలుగు: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని నియమిస్తూ జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ బుధవారం ఒక ప్రకటనను జారీ చేశారు. వాస్తవానికి సెప్టెంబర్ నెలలోనే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ హైకమాండ్ ఆన్ లైన్ ఓటింగ్ ను నిర్వహించింది. దాదాపు రెండు నెలల పాటు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. డిసెంబర్ మొదటి వారంలో విజేతను అనధికారికంగా ప్రకటించారు. అధ్యక్ష పదవి కోసం మొత్తం11 మంది పోటీ పడ్డారు. 7,10, 988 ఓట్లకు గాను 7,06,473 ఓట్లు పోలయ్యాయి. శివ చరణ్ రెడ్డికి 3,68,581ఓట్లు రాగా, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు 1,52, 466 ఓట్లు వచ్చాయి.
దీంతో శివ చరణ్ రెడ్డి 2,16,115 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను పోటీ నుంచి తప్పుకున్నట్టు వెంకట్ ముందుగానే ప్రకటించినప్పటికీ అప్పటికే ఆన్ లైన్ ఓటింగ్ బరిలో నిలవడంతో ఆయనకు లక్షన్నర ఓట్లు వచ్చాయి. ఈ ఆన్ లైన్ ఓటింగ్ లో శివచరణ్ రెడ్డి గతంలోనే విజయం సాధించారు. జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ బుధవారం చేసినా ప్రకటనతోనే ఆయన నియామకాన్ని పార్టీ గుర్తించినట్లయింది.