18 ఎకరాల దేవుడి మాన్యాలు అమ్మేశారు

అశ్వారావుపేట, వెలుగు: దేవాలయానికి చెందిన భూములను ప్రజలకు తెలియకుండా గ్రామ పెద్దలు అమ్మేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. మండలంలోని జమ్మిగూడెం రామాలయానికి చెందిన 18 ఎకరాల వ్యవసాయ భూమిని అదే ఊరికి చెందిన కొందరు గ్రామ పెద్దలు అమ్మి సొమ్ము చేసుకున్నారంటూ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇరవై ఏళ్లుగా ఆ భూమి కౌలు కింద వచ్చిన సొమ్మును ఆలయ నిర్వహణకు వాడుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఫోర్జరీ సంతకాలతో భూమి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుటే బైఠాయించారు. అక్రమంగా అమ్మేసిన భూమిని తిరిగి ఆలయానికి అప్పగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.