వాహన ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్​

వాహన ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్​
  • నెలాఖరు వరకు డెడ్​లైన్​
  • 5 వేల పై చిలుకు వాహనాల పన్నులు పెండింగ్​
  • చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై రవాణా శాఖ సీర్యస్​

జనగామ, వెలుగు: వాహనాల ట్యాక్స్ వసూళ్లపై రవాణా శాఖ అధికారులు స్పెషల్​ ఫోకస్​పెట్టారు. ఈ​ నెలాఖరు వరకు 100 శాతం వసూలే లక్ష్యంగా పెట్టుకున్నారు. జనగామ జిల్లాలో సుమారు 6 వేల పై చిలుకు వాహనాల బకాయిలు పెండింగ్​లో ఉండగా, అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. నోటీసులు జారీ చేసి సకాలంలో స్పందించకుంటే రిజిస్ట్రేషన్లను సస్పెండ్​చేస్తామని హెచ్చరిస్తున్నారు. వాహన ట్యాక్స్ రూపంలో జనగామ జిల్లాలో ప్రతీ యేటా రూ.6 కోట్ల 96 లక్షలు టార్గెట్​ఉండగా, ఇప్పటి వరకు రూ.6 కోట్ల 4 లక్షలు వసూలు అయ్యాయి.

పేమెంట్​లేట్..​

జనగామ జిల్లాలో ట్యాక్స్​వాహనాలు 12 వేల వరకు ఉన్నాయి. ఈ వాహనాలు ప్రతీ మూన్నెళ్లకు ఒకసారి ట్యాక్స్​పేమెంట్​చేయాల్సి ఉండగా, పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2350 వాహనదారులు ఇంకా ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా, నోటీసులు అందించారు. ఈ నెలాఖరు వరకు చెల్లించక పోతే తదుపరి శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. 

జిల్లా పరిధిలో 1300 ట్యాక్సీ కార్లు ఉండగా, 317 బకాయిలు చెల్లించాల్సి ఉంది. 197 స్కూల్​ బస్సులు ఉండగా, వీటిలో 6 బస్సులకు సంబంధించి ట్యాక్స్​ పెండింగ్​లో ఉంది. కాగా, ఈ ఆరు బస్సులు స్క్రాప్​నకు సిద్ధంగా ఉన్న కారణంగా చెల్లించనట్లు అధికారులు తెలిపారు. 810 హార్వెస్టర్లు ఉండగా, వీటిలో 201 వాహనాల ట్యాక్స్​పెండింగ్​లో ఉంది. ట్రాక్టర్​ట్రాలీలు 5002 ఉండగా, 1210 వాహనదారులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

గ్రీన్​ ట్యాక్స్​లూ పెండింగ్..

15 ఏండ్ల వ్యాలిడిటీ గడువు తీరిన వాహనాలకు రవాణా శాఖ గ్రీన్​ట్యాక్స్​లు వసూలు చేసి, మరో ఐదేండ్ల కాల పరిమితిని పెంచుతోంది. ఎల్లో ప్లేట్​వాహనాలైతే ఏడేండ్లకే గ్రీన్​ట్యాక్స్​చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టూ వీలర్​కు రూ.2,500, కార్లకు రూ.5 వేలు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాహనదారులు నిర్ణీత గడువులోపు చెల్లించకుంటే టూ వీలర్​కు ప్రతీ నెల రూ.300, కార్లకు రూ.500 జరిమానా విధించనున్నారు. ఈ లెక్కన రెన్యువళ్ల భారం తడిసి మోపెడుకానుంది. అందుకోసం సకాలంలో రెన్యువల్స్​ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 

కాగా, జనగామ జిల్లాలో వివిధ రకాలకు చెందిన 5,518 వాహనాల వ్యాలిడిటీ పూర్తి కాగా, రూ.48 లక్షల గ్రీన్​ట్యాక్స్​ చెల్లించాల్సి ఉంది. టూ వీలర్​వాహనాలు 3362, కార్లు 736 ఉన్నాయి. ట్రాక్టర్లు 694, ట్రాక్టర్​ ట్రాలీలు 567, హార్డెస్టర్లు 77, ఓమ్నీ వ్యాన్లు 59 పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు 9 జీపులు, 5 మోపెడ్లు గ్రీన్​ట్యాక్స్​చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.41 లక్షలు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు.

సకాలంలో చెల్లించక పోతే చర్యలు.. 

బకాయిల పెండింగ్​పై ప్రత్యేక దృష్టి సారించాం. ఈనెలాఖరు వరకు స్పెషల్​డ్రైవ్​ కొనసాగుతుంది. వాహనదారులు నిర్ణీత గడువులోగా ట్యాక్స్ చెల్లించాలి. 15 ఏండ్ల గడువు తీరిన వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాలిడిటీ ముగిసిన వాహనాలు రోడ్డెక్కితే సీజ్​చేస్తాం. 

అందుకోసం సదరు వాహనాలకు గ్రీన్​ట్యాక్స్ ను వెంటనే చెల్లించాలి. లేదంటే వీరికి ప్రతీ నెల జరిమానా పడుతూ వస్తుంది. నెలలు గడిచిన కొద్ది భారం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్ల గ్రీన్​ట్యాక్స్​పెంపు పై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అందుకోసం ఇప్పుడు చెల్లిస్తే ప్రస్తుత రూల్స్​మేరకు తక్కువ మొత్తంతో రెన్యువల్స్​పూర్తి కానున్నాయి. 
- జీవీ శ్రీనివాస్​గౌడ్, జిల్లా రవాణా శాఖ అధికారి, జనగామ