హైదరాబాద్/జనగామ/ స్టేషన్ ఘన్పూర్, వెలుగు: జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి(54) సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. హనుమకొండలోని తన నివాసంలో సాయంత్రం చాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించినా ప్రాణం దక్కలేదు. తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన పాగాల మృతి.. బీఆర్ఎస్ నేతలతో పాటు, జిల్లా వాసుల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంకు చెందిన సంపత్ రెడ్డి హనుమకొండలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం స్టేషన్ ఘన్‌పూర్‌లో తాజాగా గెలుపొందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంట్లో టీ తాగుతూ.. చాతిలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లోని రోహిణి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయారు. సంపత్ రెడ్డి కుమారుడు సాయి 2010లో హనుమకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య సుజాత ఉన్నారు. కూతురు సంజన అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.
ఉద్యమ కారుడి కోటాలో జెడ్పీ చైర్మన్
2019లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని చిల్పూరు జెడ్పీటీసీగా గెలుపొందిన పాగాల.. ఉద్యమ కారుడి కోటాలో జనగామ జెడ్పీ చైర్మన్‌గా నియామకం అయ్యారు. పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపట్టిన పార్టీ అధ్యక్షుల ఎంపికలో పాగాలకు జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి దక్కింది. 2022, ఫిబ్రవరి 11న జనగామ కలెక్టరేట్ ఓపెనింగ్ కు వచ్చిన సీఎం కేసీఆర్ అదే రోజు జిల్లా పార్టీ ఆఫీస్ ను ప్రారంభించి పాగాలను కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి అటు జెడ్పీ చైర్మన్‌గా, ఇటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. 2002 నుంచి 2006 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ యువజన విభాగం ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2006 నుంచి 2013 వరకు స్టేషన్ ఘన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడిగా, 2013 నుంచి 2015 వరకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా కూడా పనిచేశారు.
ఆర్నెళ్లు కూడా గడవక ముందే మరో జెడ్పీ చైర్మన్
ములుగు జెడ్పీ చైర్మన్, ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీశ్ ఇదే యేడాది జూన్ 11న గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన జరిగి ఆర్నెళ్లు కూడా గడవక ముందే జనగామ జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి కూడా గుండెపోటుతోనే అకాల మరణం చెందడం బీఆర్ఎస్లో తీవ్ర విషాదం నింపింది. ఆదివారం వెలువడిన ఎలక్షన్ రిజల్ట్స్ తో రాష్ట్రంలో అధికారం కోల్పోయి బాధలో ఉన్న పార్టీ శ్రేణులను పాగాల మృతి ఘటన మరింత శోక సంధ్రంలో ముంచింది. పాగాల డెడ్‌బాడీని హనుమకొండ నుంచి సొంత గ్రామం రాజవరం తరలించారు.
పాగాల మృతి బాధాకరం : కేసీఆర్
పాగాల సంపత్‌రెడ్డి మృతి బాధకరమని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి తన వెంట నడిచారని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ సీనియర్‌నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్బండా ప్రకాశ్ తదితరులు సంపత్‌రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి పాగాల మృతిదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.