గోదావరిఖని, వెలుగు: తెలంగాణ సర్కార్ కార్మికులకు సంబంధించిన ప్రయోజనాలపై జీవోలు ఇచ్చిందే తప్ప గెజిట్‌లో పొందుపర్చలేదని, దీనివల్ల ఆ ప్రయోజనాలు కార్మికులకు అందడం లేదని ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని యూనియన్ ఆఫీస్‌లో జరిగిన అసంఘటిత రంగ కార్మికుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ కార్మికులకు సంబంధించిన 76 జీవోలను విడుదల చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ అందులో నాలుగు మాత్రమే గెజిట్‌లో పొందుపర్చారని, మిగతా వాటిని పక్కన పెట్టారన్నారు. ఏదైనా గెజిట్‌లో పొందుపరిస్తేనే కార్మికులకు వర్తిస్తాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు కూలీలకు ఏడాదిలో 200 పనిదినాలు కల్పిస్తామని, కనీస వేతనం రూ.400కు పెంచుతామన్నారు. త్వరలోనే ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక డిక్లరేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఐఎన్‌టీయూసీ కార్యదర్శి పూసాల తిరుపతి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి దాస్ , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.నర్సింహరెడ్డి, సెంట్రల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, సదానందం, మనోహర్, శ్రీనివాస్, సాగర్, ఆంజనేయులు, మహిళ కో ఆర్డినేటర్ స్వప్న పాల్గొన్నారు.