క్రీడల్లో అద్భుతాలు జరగడం సహజం. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఊహించని విజయాలు అభిమానులకి కిక్ ఇస్తాయి. ఓడిపోయే మ్యాచ్ గెలిచినా..చిన్న జట్టు పెద్ద జట్టును మట్టికరిపించినా సంచలన న్యూస్ అవుతుంది. ఇలాంటివి ఒకటి జరిగినప్పుడే ఆహా, ఓహో అనేస్తారు. అలాంటిది ఒకే రోజు మూడు అద్భుతాలు నిన్న(జనవరి 28) జరిగాయి. రెండు క్రికెట్ లో, ఒకటి టెన్నిస్ లో నమోదయింది. దీంతో స్పోర్ట్స్ లవర్స్ కు జనవరి 28 ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలింది.
ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 27 ఏళ్ళ తర్వాత విజయం
ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ జట్టు విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయినా అనుభవం లేని విండీస్ జట్టు పటిష్టమైన కంగారూల జట్టును చిత్తు చేసి సంచలన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్.. 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 216 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 207 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. తొలి సిరీస్ ఆడుతున్న విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ 7 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు.
టీమిండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్
సొంతగడ్డపై టీమిండియాను ఓడించాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వదేశంలో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 190 పరుగుల ఆధిక్యం లభించినా ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకే ఆలౌటై 28 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి టీమిండియా ఫ్యాన్స్ కు షాక్ కు గురి చేసింది. రోహిత్ కెప్టెన్సీలో చివరి మూడు టెస్టుల్లో స్వదేశంలో భారత్ కు ఇది రెండో ఓటమి. చివరిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు ఓడిపోగా..నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది.
ఫైనల్లో సిన్నర్ సంచలన విజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఫైనల్లో మెద్వెదేవ్ కు సిన్నర్ ఊహించని షాక్ ఇచ్చాడు. తొలి రెండు సెట్స్ లో సిన్నర్ ఓడిపోవడంతో మ్యాచ్ ఏకపక్షమే అనుకున్నారు. అయితే మూడో సెట్ నుంచి పుంజుకున్న సిన్నర్.. మెద్వెదేవ్ వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన ఈ ఇటలీ కుర్రాడు ఐదు సెట్ల పాటు జరిగిన ఈ థ్రిల్లర్‌లో 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తో మెద్వెదేవ్ పై గెలిచి విజేతగా నిలిచాడు.
January 28th, 2024—a day etched in the hearts of sports fans everywhere.#INDvENG #AUSvWI #AustralianOpen #AO pic.twitter.com/E44dWPorlV
— CricTracker (@Cricketracker) January 28, 2024