శామీర్ పేట,వెలుగు: ఆలయానికి కన్నంపెట్టి స్వామి వారి బంగారు, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. శామీర్ పేట పోలీసులు తెలిపిన ప్రకారం.. శామీర్ పేట మండలంలోని అలియాబాద్ రత్నాలయం గోడకు మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కన్నం పెట్టి లోనికి వెళ్లారు. బుధవారం ఉదయం పండితులు ఆలయ తలుపులు తెరిచి చూడగా విలువైన ఆభరణాలు కనిపించలేదు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శామీర్ పేట పోలీసులు, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లి పరిశీలించారు. బంగారు ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు చోరీ అయినట్టు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 20లక్షలకుపైగా ఉంటాయి. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాములు తెలిపారు. సీఐ శ్రీనాథ్ ఉన్నారు.