2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తం జియో 5G : ముఖేష్ అంబానీ

2023 డిసెంబర్ నాటికి  దేశం మొత్తం జియో 5G : ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షికోత్సవం సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు చైర్మన్ ముఖేష్ అంబానీ. 2023 డిసెంబర్ నాటికల్లా దేశవ్యాప్తంగా జియో5జి అమలు చేస్తామని ప్రకటించారు. దీనికోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించే అవకాశం ఉంది. జియో భారత్ 4 జీ తరహాలో జియో 5జి స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేక ప్లాన్స్ ప్రకటించే అవకాశం ఉందని మొబైల్ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

2026 నాటికి  బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ 

2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ప్రారంభించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. 2035 నెట్‌ జీరో లక్ష్యాలను అందుకోవాలనుకుంటున్నట్లు ముకేశ్‌ అంబానీ తెలిపారు.

గ్యాస్‌ బిజినెస్‌ లో ముందడుగు..

బీపీ భాగస్వామ్యంతో కలిసి కేజీబీ బ్లాక్‌-6లో 20 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తిని పునరుద్ధరించినట్లు ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. రోజుకి ఇక్కడ 14 మిలియన్‌ క్యూబిల్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రోజుకి 30 మిలియన్ల స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. 

ఇన్సురెన్స్‌ రంగంలోకి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

బీమా రంగంలోకి అడుగుపెడుగున్నట్లు  ప్రకటించారు ముఖేష్ అంబానీ. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ద్వారా బీమా రంగంలోకి దిగుతున్నామని.. ఆరోగ్య బీమా సేవలను దీని ద్వారా  అందించనున్నట్లు చెప్పారు. రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ తరహాలోనే జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కూడా సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

45 కోట్లకు జియో యూజర్లు

దేశంలో రిలయన్స్‌ జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటారని ముకేశ్‌ అంబానీ తెలిపారు. ప్రస్తుతం జియో 5జీ యూజర్లు 5 కోట్ల మంది ఉన్నారని తెలిపారు.