నడిగడ్డలో ఇన్​చార్జీల పాలన ఒకే ఆఫీసర్​కు నాలుగు శాఖల బాధ్యతలు

 నడిగడ్డలో ఇన్​చార్జీల పాలన ఒకే ఆఫీసర్​కు నాలుగు శాఖల బాధ్యతలు
  • ముఖ్యమైన పోస్టులన్నింటిలో ఇదే పరిస్థితి
  • ఇన్ చార్జీ ఆఫీసర్లు ఉండడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమైన జిల్లా స్థాయి ఆఫీసర్ల పోస్టులు ఇన్ చార్జీలతో నడుస్తున్నాయి. అడిషనల్  కలెక్టర్(లోకల్ బాడీస్)తో పాటు డీఆర్డీవో, డీపీవో, డీఏవో, డీఈవో, డిఎల్పీవో, డిప్యూటీ సీఈవో, ఆర్డీవో, డీఎంహెచ్​వో, డీసీహెచ్ లుగా ఇన్ చార్జి ఆఫీసర్లే ఉన్నారు. ఉన్నతాధికారులు ఇన్​చార్జీలుగా ఉండడంతో ఆయా ఆఫీసుల్లో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 జడ్పీ సీఈవోగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న నర్సింగరావుకు ఏకంగా నాలుగు శాఖలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఆర్డీవోగా జిల్లాకు వచ్చిన ఆయనను ప్రభుత్వం జడ్పీ సీఈవోగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయన నాలుగు పోస్టులకు ఇన్​చార్జిగా ఉన్నారు. చాలా కాలం నుంచి పోస్టులు ఖాళీగా ఉండడంతో వివిధ రకాల పనులు సకాలంలో పూర్తి కావడం లేదని అంటున్నారు. ఇక్కడి రాజకీయాల కారణంగా ఆఫీసర్లు జిల్లాలో పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. 

రెగ్యులర్​ ఆఫీసర్లు లేక సమస్యలు..

రెగ్యులర్  ఆఫీసర్లు లేకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని శాఖల్లో సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. ఇన్​చార్జి ఆర్డీవో కావడంతో ఆయన రెవెన్యూ శాఖకు సంబంధించిన ఏ ఫైల్  ముట్టుకోవడం లేదని అంటున్నారు. జిల్లాకు ఇటీవల డీఆర్డీవోగా నర్సింగరావు బదిలీపై వచ్చారు. ఆ తరువాత అడిషనల్  కలెక్టర్(లోకల్  బాడీస్) ట్రాన్స్​ఫర్ పై వెళ్లడంతో ఇన్​చార్జి బాధ్యతలు ఇచ్చారు.

 అనంతరం జరిగిన బదిలీల్లో డీఆర్డీవో నుంచి జడ్పీ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం జడ్పీ సీఈవోగా పని చేస్తున్న ఆయన అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), డీఆర్డీవో, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు స్పెషల్  ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక ఆఫీసరు ఇన్ని బాధ్యతలు నిర్వహించడం భారమేనని చర్చ జరుగుతోంది.

ఆఫీసుల్లో ఇష్టారాజ్యం..

జిల్లాలోని ముఖ్యమైన శాఖల్లో రెగ్యులర్  ఆఫీసర్  లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీపీవో ఆఫీస్​లో ప్రతి ఫైలుకు ఒక రేట్​ ఫిక్స్​ చేసి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆఫీస్​లో ఏ ఫైల్  మూవ్​ కావాలన్నా ఇద్దరు ఉద్యోగులను కలవాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. 

రెగ్యులర్  డీఆర్డీవో లేకపోవడంతో ఫీల్డ్ లో ఉపాధి హామీ పథకం నీరుగారి పోతుందని అంటున్నారు. ఫీల్డ్  అసిస్టెంట్లు అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. రెగ్యులర్  డీఎంహెచ్ వో లేకపోవడంతో పీహెచ్​సీలపై పర్యవేక్షణ కరువైంది. ఇన్​చార్జి ఆర్డీవో కావడంతో నిజమైన రైతులకు కూడా ఓఆర్సీలు ఇవ్వడం లేదని, నెలల తరబడి రైతులు ఆర్డీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది.

సెలవుపై వెళ్లి తిరిగి జాయిన్​ కాలే..

ఆర్అండ్ బీ ఈఈ ప్రగతి నెల రోజులు సెలవు పెట్టి వెళ్లారు. సెలవులు ముగిసినా తిరిగి డ్యూటీలో జాయిన్  కాలేదు. ఇక్కడ పని చేసేందుకు ఆమె విముఖత చూపుతున్నారని, వేరే జిల్లాకు ట్రాన్స్​ఫర్​పై వెళ్తారనే చర్చ జరుగుతోంది. ఆమె డ్యూటీలో జాయిన్  కాకపోతే మరో పోస్టుకు ఇన్​చార్జి  ఆఫీసర్ ను నియమించాల్సి వస్తుందని అంటున్నారు.

సర్కారే నిర్ణయం తీసుకోవాలి..

జిల్లాలో మెజార్టీ జిల్లా ఆఫీసర్లు లేని మాట వాస్తవమే. వారి స్థానంలో ఇన్ చార్జీలను నియమించి పాలనను కొనసాగిస్తున్నాం. జిల్లా ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వానికి నివేదించాం. సర్కారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – లక్ష్మీనారాయణ, అడిషనల్  కలెక్టర్