మందుపాతర పేలి జర్నలిస్టు మృతి

మందుపాతర పేలి జర్నలిస్టు మృతి
  • ఒడిశాలోని మోహన్‍గిరి ప్రాంతంలో ఘటన
  • పోలీసులే లక్ష్యంగా మందుపాతర ఏర్పాటు చేసిన మావోయిస్టులు
  •  పంచాయతీ ఎన్నికల ఫొటోలు తీసేందుకు వెళ్లి జర్నలిస్టు మృతి

భద్రాచలం, వెలుగు:  భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు   జర్నలిస్టు బలయ్యాడు. ఈ ఘటన మన రాష్ట్ర సరిహద్దు ఒడిశాలోని మోహన్‍గిరి ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలో  పంచాయతీ ఎలక్షన్స్​ జరుగుతున్నాయి. వీటిని  మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. కల్హంది జిల్లా మదన్‍పూర్​ రాంపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మోహన్‍గిరి డిల్లాన్​ ప్రాంతంలో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ  ఓ చెట్టుకు వాల్ ​పోస్టర్లు అంటించారు. వాటిని తొలగించేందుకు భద్రతాబలగాలు వస్తాయని, అక్కడే మందుపాతర అమర్చారు. అయితే పోలీసుల కంటే ముందుగా ఒడియా డైలీ పత్రిక ధరిత్రి జర్నలిస్టు రోహిత్​ బిశ్వాల్ తన బైక్​పై వచ్చి ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మందుపాతర పేలింది. పేలుడుకు బిశ్వాల్‍ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి బైక్​ ధ్వంసమైంది. బిశ్వాల్​ సొంతూరు మోహనగిరి. సీఆర్పీఎఫ్​ బలగాలు, బాంబ్‍స్క్వాడ్​ టీమ్​లు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.