దేవాదుల పెండింగ్​ పనులు పూర్తి చెయ్యాలె

దేవాదుల పెండింగ్​ పనులు పూర్తి చెయ్యాలె

జనగామ/ స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : వచ్చే 15 నెలల్లో దేవాదుల పెండింగ్​పనులు పూర్తయ్యేలా అధికారులు పనిచేయాలని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం జనగామ కలెక్టరేట్ లో కలెక్టర్​ రిజ్వాన్ బాషాషేక్, అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్​తో కలిసి ఇరిగేషన్​శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో రివ్యూ నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగునీరు అందించనున్నామని, పెండింగ్​పనుల పూర్తికి కలెక్టర్, ఇరిగేషన్​సీఈ ప్రతి నెల రివ్యూ చేపట్టాలన్నారు. 

నీటి పారుదల శాఖ అధికారులకు కనీస అవగాహన లేదని అసహనం వ్యక్తం చేశారు. మల్లన్నగండి లిఫ్ట్​–1, లిఫ్ట్​–2 పనులు జులైలోగా, అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాల్వ పనులు డిసెంబర్​ లోగా పూర్తి కావాలన్నారు. ఆర్ఎస్​ ఘన్​పూర్​ నుంచి నవాబుపేట రిజర్వాయర్​ ప్రధాన కాల్వ సీసీ లైనింగ్​పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ధర్మసాగర్​ సౌత్​ మెయిన్​ కెనాల్, నక్కల తూము పనులు పూర్తి చేయాలన్నారు. దేవాదుల పనులన్నింటినీ పూర్తి చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు. 

పేదల పక్షపాతి సీఎం రేవంత్​రెడ్డి.. 

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం స్టేషన్​ఘన్​పూర్​ పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించి, తాటికొండ యాదమ్మ ఇంట్లో రేషన్​ద్వారా అందుకున్న సన్నబియ్యం భోజనం కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్, అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​సింగ్​తో కలిసి తిన్నారు. కాగా, స్థానిక బస్టాండ్​సమీపంలో కాంగ్రెస్​ గ్రామశాఖ అధ్యక్షుడు నీల వేంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ఆర్ఆర్ యూ కంగన్​హాల్, గార్మెంట్స్​షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్కడ పటాకులు కాల్చడంతో షామియానా పై పడి మంటలు చెలరేగాయి. అక్కడున్న వారు నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. స్టేషన్​ఘన్​పూర్​మండలం ఇప్పగూడెంలో పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే కడియం హాజరై మొక్కులు చెల్లించారు. ముదిరాజ్​ సంఘం నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.