కేయూలో అధ్యాపకుల కొరత

కేయూలో అధ్యాపకుల కొరత
  • కాకతీయ యూనివర్సిటీలో 409 రెగ్యూలర్‍ టీచింగ్‍ స్టాఫ్​లో మిగిలింది 76 మందే..
  • 55 మంది ప్రొఫెసర్‍ పోస్టులకు.. 55 ఖాళీలే 
  • ప్రొఫెసర్ల లేక, విద్యార్థులు రాక పీజీ సీట్లు భర్తీ కావట్లే..

వరంగల్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో సార్లులేని చదువులు సాగుతున్నాయి. ఇక్కడ ఉండాల్సిన ప్రొఫెసర్లలో కనీసం 20 శాతం కూడా అందుబాటులో లేరు. రెగ్యూలర్‍ ప్రొఫెసర్లు లేక పీజీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అనుభవజ్ఞులైన గురువుల పర్యవేక్షణ లేక పీహెచ్‍డీ పరిశోధనల్లో వెనుకబడిపోతున్నారు. ఫ్యాకల్టీ కొరతతో విద్యా ప్రమాణాలు దెబ్బతిని కేయూ ప్రతిష్ట మసకబారుతోంది.

409 మంది ప్రొఫెసర్లకు.. 333 ఖాళీలు  

వరంగల్‍ కేయూలో స్థాయికి అనుగుణంగా 409 టీచింగ్‍ పోస్టులను సాంక్షన్‍ చేశారు. ఇందులో ప్రొఫెసర్‍ 55, అసోసియేట్‍ ప్రొఫెసర్లు 96, అసిస్టెంట్‍ ప్రొఫెసర్లు 258 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అందుబాటులో ఉన్నవారు కేవలం 76 మంది మాత్రమే. 55 ప్రొఫెసర్‍ పోస్టులకు 55 ఖాళీగా ఉన్నాయి. 96 అసోసియేట్‍ పోస్టులకు కేవలం ఇద్దరు, 258 అసిస్టెంట్‍ ప్రొఫెసర్లకు 77 మంది మాత్రమే ఉన్నారు. 

మొత్తం 409 మందికి 333 రెగ్యూలర్ టీచింగ్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1992 లో అప్పటి వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‍ ప్రభుత్వ పర్మినెంట్ టీచింగ్‍ ప్రొఫెసర్ల నియమాకం చేపట్టగా, 2005, 2010 వరకు మరికొన్ని భర్తీలు జరిగాయి. ఆ తర్వాత కేయూలో రెగ్యూలర్‍ ప్రొఫెసర్ల రిటైర్మెంట్లు తప్పితే, పూర్తిస్థాయి రిక్రూట్మెంట్లు జరగలేదు.  దీంతో 15 ఏండ్లుగా కాకతీయ యూనివర్సిటీ విద్యావ్యవస్థ కుంటుపడింది.

గైడ్స్​ లేకుండానే.., పీహెచ్‍డీ స్టూడెంట్ల రీసెర్చ్​

యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో స్టూడెంట్లు పరిశోధనలు చేసే క్రమంలో శాశ్వత ప్రాతిపాదికన అందుబాటులో ఉండే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే పర్యవేక్షణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ తరహా బోధన సిబ్బందిలో 80 శాతం ఖాళీలే ఉన్నాయి. దీని ప్రభావం పీహెచ్‍డీ స్టూడెంట్లు చేసే రీసెర్చ్​లపై పడుతోంది. యూనివర్సిటీలో కాంట్రాక్టు పోస్టుల్లో దాదాపు 183 మంది, పార్ట్​ టైం 215 మంది అధ్యాపకులు ఉండగా, వీరెవరికీ క్లాసులు చెప్పడం తప్పించి, పీహెచ్డీ గైడ్​గా ఉండే  అధికారం లేదు.

 దీంతో యూనివర్సిటీ విద్యార్థుల పరిశోధనల్లో నాణ్యత కొరవడి ఉద్యోగాలు, పోటీ పరీక్షల్లో వారు నష్టపోతున్నారు. దాదాపు 27 విభాగాల్లో 35 కోర్సులు ఉండగా, తెలుగు, పొలిటికల్ సైన్స్​ విభాగాలకు కనీసం హెచ్ఓడీలు కరువయ్యారు. హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‍తోపాటు పలు డిపార్టుమెంట్లలో ఒకరు చొప్పున గైడ్ ఉన్నారు. ఒకప్పుడు పీజీ, పీహెచ్‍డీ  కోసం దాదాపు 6 వేల మంది స్టూడెంట్లు పోటీ పడితే, ఇప్పుడు పలు కోర్సుల వైపు విద్యార్థులు చేరేందుకు ఉత్సాహం చూపకపోవడంతో పీజీ సీట్లు భర్తీ కావడం లేదు. 

రిక్రూట్మెంట్ పై  సందిగ్దం.. 

గతంలో యూజీసీ నిబంధనల ప్రకారం ఆయా యూనివర్సిటీలు సొంతంగా బోధన సిబ్బంది నియామకాలు చేసుకునే వీలుండేది. గత ‘కామన్‍ రిక్రూట్‍మెంట్‍ బోర్డు’ను తీసుకొచ్చింది. ఈ బిల్లు వివిధ కారణాలతో ఆగిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో నియామకాలపై గంటా చక్రపాణి ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో సమస్యను ఎలా క్లియర్‍ చేస్తారనేదానిపై సందిగ్దం ఏర్పడింది. 

పదేళ్లుగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నయ్.. 

ఓరుగల్లు విద్యా కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీలో గత పదేళ్లుగా ఎటువంటి రిక్రూట్మెంట్లు లేక విద్యా ప్రమాణాలు పడిపోతున్నయ్. మా హయాంలో ఎప్పటికప్పుడు బోధన సిబ్బంది నియామకాలు చేసుకుని విద్యార్థులను కేయూ వైపు వచ్చేలా చూశాం. ప్రస్తుతం పీహెచ్డీ స్టూడెంట్ల పరిశోధనలను గైడ్‍ చేయడానికి  ప్రొఫెసర్లు లేరంటే పరిస్థితి ఏంటో తెలిసిపోతోంది.  కూరపాటి వెంకటనారాయణ (రిటైర్డ్​ ప్రొఫెసర్)

నియామకాలపై నిర్ణయం తీసుకోవాలే..

కేయూలో 2010 ఏడాదికి ముందు, ఆ తర్వాత రిటైర్మెంట్లు తప్పితే, పర్మినెంట్‍ టీచింగ్‍ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్లు లేవ్. 409 మంది రెగ్యూలర్‍ టీచింగ్‍ ప్రొఫెసర్లు ఉండాల్సినచోట కేవలం 76 మందికి తగ్గడంతో పీహెచ్డీ స్టూడెంట్లపై గైడెన్స్​ లేక అది యూనివర్సిటీ క్రెడిబిలిటీపై పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియామకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. - డాక్టర్‍ తిరునహరి శేషు (అసిస్టెంట్‍ ప్రొఫెసర్)