మహిళా దినోత్సవం ప్రత్యేక కథనం.. ప్రపంచానికి దిక్సూచి.. మహిళా శక్తి

మహిళా దినోత్సవం ప్రత్యేక కథనం.. ప్రపంచానికి దిక్సూచి.. మహిళా శక్తి

మహిళలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం, లింగ సమానత్వాన్ని సాధించడం కోసం  ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 1975 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.  జర్మనీలోని  సోషల్  డెమోక్రటిక్ పార్టీ మహిళా కార్యాలయం నాయకురాలు కార్ల జెట్ కిన్ అనే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి సంవత్సరం ఈరోజునే మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఆమె ప్రతిపాదించింది. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం  సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలతో సహా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గౌరవిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో ముడిపడి ఉన్న రంగులలో ఊదా, తెలుపు, ఆకుపచ్చ ఈ మూడు రంగులు మహిళల పోరాటాల  వివిధ కోణాలను సూచిస్తున్నాయి.  ఊదా రంగు న్యాయం, గౌరవాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు స్వచ్ఛతను, శాంతియుత భవిష్యత్తు కోసం ఆశను సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు ఆశ, వసంతాన్ని సూచిస్తుంది. మొదటిసారిగా ఈ రంగులను యూకేలోని మహిళా సామాజిక, రాజకీయ సంఘం స్వీకరించి విస్తృతపరిచింది. అప్పటినుంచి ఈ మూడు రంగులు ప్రపంచ మహిళా హక్కుల ఉద్యమానికి చిహ్నంగా మారాయి. 2025 సంవత్సరానికిగాను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ‘ప్రతి మహిళ, ప్రతి బాలికకు హక్కులు - సమానత్వం’ అనే  థీమ్​తో  వేడుకలు చేయనున్నారు.

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ
 స్వాతంత్ర్య  పోరాట సమయంలో పురుషులతో సమానంగా రాజ్యాధికారాన్ని నిర్వహించిన రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట పటిమ తెలిసినా కూడా  మహిళలను చులకనగా చూడడం పరిపాటిగా మారిపోయింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అనేకమంది మహిళలు, పురుషులతో సమానంగా పనిచేశారు. ఉదాహరణకు సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్​ముఖ్, కస్తూరిబా గాంధీ, అరుణ ఆసఫ్ అలీ లాంటి వందలాదిమంది  సంగ్రామంలో నడుం కట్టి ఉద్యమాన్ని  నడిపించారు. అయినా వారి త్యాగాలను స్మరించుకోవడం చాలా అరుదు.

క్విట్ ఇండియా ఉద్యమంలో అరుణ ఆసఫ్ అలీ  ఒంటి చేతితో ఉద్యమాన్ని నడిపించిన సంగతి మనం గుర్తించడం లేదు. అలాగే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి  మొదటి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ తీసుకున్న కఠినమైన నిర్ణయాలను మనం కొనియాడక తప్పదు. ఇందిరా గాంధీని  కాళీమాతతో పోల్చడం మనకు గర్వించదగ్గ విషయం. 

కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు
పురుషాధిక్యతను అధిగమించి రాజ్యాధికారాన్ని చేపట్టిన మాయావతి, మమతా బెనర్జీ విజయవంతంగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వారి రాజకీయ చతురత, మహిళల  రాజకీయ సామర్థ్యానికి నిదర్శనం. భారతదేశంలో ఇందిరా గాంధీ తర్వాత పూర్తి బాధ్యతలను ఆర్థికశాఖ మంత్రిగా నిర్వహించిన మహిళగా  నిర్మలా సీతారామన్​ను  పరిగణించవచ్చు. నిర్మలా సీతారామన్​ భారతదేశంలోనే  అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన  కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మురార్జీ దేశాయ్  రికార్డును బ్రేక్ చేశారు.

2023లో ఆమె ఫోర్బ్స్  జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళలలో 32వ స్థానంలో  నిలిచారు. అదేవిధంగా 2024లో 28వ స్థానంలో నిలిచింది.  మహిళా సాధికారతకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోపాటు  కేంద్రం ప్రవేశపెట్టిన నారీశక్తి మహిళల ఉన్నతికి దోహదపడుతోంది.  మహిళలకు  ప్రోత్సాహాన్ని అందిస్తే భవిష్యత్తులో దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచే  శక్తిగా ఎదిగే సత్తా   మన మహిళలకు ఉంది.  మహిళలందరికీ అంతర్జాతీయ  మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

డా. లావణ్య, కాకతీయ యూనివర్సిటీ