
హసన్ పర్తి, వెలుగు : యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, కాకతీయ యూనివర్సిటీ వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కామర్స్ కాలేజీ సెమినార్ హాల్ లో జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా కే.ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు.
యూత్ పార్లమెంట్ వేదిక యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు జాతీయ అభివృద్ధి, విధాన నిర్మాణం, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించేందుకు అద్భుతమైన అవకాశం కల్పిస్తుందన్నారు. 150 మంది విద్యార్థులు ఈ యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనడం ఆనంద దాయకమన్నారు. కార్యక్రమంలో కాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.మమత, నెహ్రూ యువకేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలు నిస్వార్ధపురితంగా ఉండాలి..
రాజకీయాలు నిస్వార్ధపురితంగా ఉండాలని, భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో సంకీర్ణ రాజకీయాలు చాలా అవసరమని కేయూ వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ పొలిటికల్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ ఎస్. వెంకటయ్య అధ్యక్షతన ‘సంకీర్ణ రాజకీయాలు, భారతీయ సమాజంలో ప్రజాస్వామ్యం’పై నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు దశా దిశ నిర్దేశనం చేయాలన్నారు.