- కాళేశ్వరం డిజైన్ తనదేనంటూ అంతర్జాతీయ స్థాయిలో డబ్బా
- ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట డిస్కవరీ చానల్లో గొప్పలు
- ప్రజల సొమ్ముతో ప్రాజెక్టు కడితే.. సొంత డబ్బులతో కట్టినట్లు బిల్డప్
- దేశ విదేశాల్లో మరిన్ని టెండర్లు దక్కించుకునేందుకు స్కెచ్
హైదరాబాద్, వెలుగు: ఏడేండ్లుగా తెలంగాణ ఖజానాను లూటీ చేస్తున్న మేఘా కంపెనీ.. ఇప్పుడు మన సొమ్ముతో సోకులు చేసుకుంటోంది. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కట్టింది తామేనని గొప్పలు చెప్పుకుంటోంది. తమ సొంత డబ్బులతోనే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించినట్లుగా సొంత డబ్బా కొట్టుకుంటోంది. ఇప్పటి దాకా ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వని ఆ ప్రాజెక్టు డిజైన్ల నుంచి నీళ్ల లిఫ్టింగ్ దాకా తమ కంపెనీ అద్భుతాలేనంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటోంది. తనకు మించిన బడాయి లేదన్నట్లుగా ‘డిస్కవరీ చానల్’లో ఇటీవలే ఓ చిన్నపాటి సినిమాను చూపించింది. 55 నిమిషాల పాటు ప్రసారమైన ఈ డాక్యుమెంటరీలో మొత్తం తానే అన్నట్లు కటింగ్ ఇచ్చింది. పూర్తిగా రూ. లక్ష కోట్ల మన సొమ్ముతోనే ఈ ప్రాజెక్టును కట్టిన విషయాన్ని మరిచిపోయి, తమ కంపెనీ ఘనతేనని డాక్యుమెంటరీతో భారీ ప్రచారం చేసుకుంది. గడిచిన ఏడేండ్లలో తెలంగాణలో వివిధ పనులు దక్కించుకున్న ఈ ఆంధ్రా కంపెనీ.. రాష్ట్ర ఖజానా నుంచి రూ. లక్ష కోట్లకుపైగా సంపాదించుకుంది. ఈ డబ్బులతోనే మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలోకెక్కిన విషయం మరిచిపోయింది. కాళేశ్వరం డాక్యుమెంటరీ తో ప్రమోషన్ చేసుకోవటం ద్వారా దేశవిదేశాల్లో మరిన్ని గ్లోబల్ టెండర్లు దక్కించుకోవచ్చనే బిజినెస్ మైండ్ గేమ్‌ను ప్లే చేసింది.
గత నెలాఖరున డిస్కవరీ చానల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం మేఘా గొప్పతనమేనని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ఇక్కడి ప్రభుత్వ ప్రయత్నం ఇందులో వెతికినా కనిపించదు. మేఘా కంపెనీ సొంత కష్టంతోనే కాళేశ్వరం మొత్తం పూర్తి చేసినట్లుగా డాక్యుమెంటరీలో ఆద్యంతం చూపించారు.
అంచనాలు తుస్సయ్యాయి
డిస్కవరీ చానల్లో డాక్యుమెంటరీ ప్రసారానికి ముందు తెలంగాణ ప్రభుత్వం నానా హడావుడి చేసింది. అంతర్జాతీయ స్థాయి చానళ్లు కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకోవటం అరుదైన రికార్డు అంటూ ప్రచారం చేసుకుంది. ‘ప్రపంచం చూపు కాళేశ్వరం వైపు..’ అంటూ డిస్కవరీ చానల్లో వచ్చే డాక్యుమెంటరీతో కేసీఆర్ గొప్పదనం అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని కేసీఆర్ సొంత మీడియాలో అడ్వాన్సుగా వార్తలు రాసుకుంది. ఈ డాక్యుమెంటరీ తప్పక చూడాలంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రచారం చేసింది. తీరా డాక్యుమెంటరీ ప్రసారం అయ్యాక.. మేఘా బడాయిలు తప్ప ప్రభుత్వానికి వస్తుందనుకున్న క్రెడిట్ తుస్సయ్యిందని ప్రభుత్వ పెద్దలు సైలెంటయ్యారు.
ప్రాజెక్టును డిజైన్ చేసింది మేఘానేనట!
కాళేశ్వరం ప్రాంతాన్ని ఎంపిక చేసిన తర్వాత ప్రాజెక్టును మేఘా కంపెనీనే డిజైన్ చేసినట్లు డాక్యుమెంటరీలో స్పష్టంగా చెప్పుకున్నారు. మేఘా కృష్ణారెడ్డి ఇంజినీర్లు, నిపుణులతో చర్చిస్తున్నట్లుగా పదేపదే చూపించారు. 30 ఏండ్ల అనుభవంతో ప్రపంచంలోనే అతిపెద్ద పంపులను మేఘా కంపెనీ ఏర్పాటు చేసిందని వాయిస్ ఓవర్లో చెప్పారు. మేఘా టీమ్ 24 నెలల టైం తీసుకొని ప్రాజెక్టు డిజైన్ ను పూర్తిచేసిందని అన్నారు. ఇందులో రిజర్వాయర్ లేకుండానే నదిలోనే 16 టీఎంసీల స్టోరేజీ ఉంటుందని చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేసింది తానేనని అవకాశం దొరికినప్పుడల్లా గొప్పలు చెప్పుకునే కేసీఆర్ పేరు డాక్యుమెంటరీలో పెద్దగా వినిపించకపోవడం గమనార్హం.
నిజానిజాలతో సంబంధం లేదన్న డిస్కవరీ చానల్
‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట ప్రసారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంటరీలో ‘ఇది ఎంటర్ టైన్మెంట్ కోసం చేసిన ప్రోగ్రాం’ అని డాక్యుమెంటరీకి మొదట్లో ఇచ్చిన ‘డిస్ క్లెయిమర్ ’లోనే డిస్కవరీ చానల్ యాజమాన్యం స్పష్టంగా చెప్పింది. ఇందులో చెప్పిన అభిప్రాయాలన్నీ తీసినవాళ్లవేననీ, తమకెలాంటి సంబంధం లేదని తేల్చేసింది. అందుకని ఇందులో సమాచారంలో తప్పొప్పులు ఉంటే తమకెలాంటి బాధ్యత లేదంది. ఈ సమాచారాన్ని తాము ఆమోదించడంగానీ, సపోర్ట్ చేయడంగానీ, నిర్ధారించడంగానీ చేయలేదని డిస్కవరీ క్లారిటీ ఇచ్చింది. డిస్ క్లెయిమర్ తోనే ఇది పెయిడ్ ప్రమోషన్ అని స్పష్టంగా ప్రేక్షకులకు చెప్పేసింది. అసలు డిస్కవరీ చానల్ కాళేశ్వరంపై స్పెషల్ డాక్యుమెంటరీ తీయలేదని, తమ కంపెనీని ప్రమోట్ చేసుకునేందుకు వారికి నచ్చినట్టు మేఘానే ఈ వీడియోను చిత్రీకరించి పెయిడ్ ప్రోగ్రామ్‌గా వేయించుకుందనే వాదనలున్నాయి.