- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అధికం
- కాళేశ్వరం బ్యార్ వాటర్లో 10 వేల ఎకరాల్లో పంటల మునక
వెలుగు, ఆదిలాబాద్/నిర్మల్/ కుమ్రం భీ ఆసిఫాబాద్, వెలుగు : ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. నాలుగు జిల్లాల్లో కలిసి సుమారు 80వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో 35 వేల ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 30వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఇప్పటికే వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి, జైపూర్మండలాల్లోని దాదాపు 20 గోదావరి తీర ప్రాంత గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం జరిగింది.. జిల్లాలో 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.మహారాష్ట్రలో అప్పర్ వార్ధా ప్రాజెక్ట్ 16 గేట్లు, చంద్రాపూర్ జిల్లా లోని ఇరాయి డ్యామ్ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడం తో వార్ధా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పారిగామ్ వద్ద బ్రిడ్జి మీద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగడంతో పంట చేన్లు నీట మునిగిపోయాయి.
నిర్మల్ జిల్లాలో 30 వేల ఎకరాలలో
భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంటలకు నష్టం వాటిల్లింది. పత్తి, సోయా బీన్, మొక్కజొన్న తదితర పంటలు నష్టపోయాయి. దాదాపు 30వేల ఎకరాలలో రూ. 20 కోట్ల వరకు పంటల నష్టం జరిగిందినట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో 22 , పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 50 రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 200 హాబిటేషన్లలో మిషన్ భగీరథ పైప్ లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
200 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. నిర్మల్, బైంసా, ఖానాపూర్ లలో 108 ఇల్లు నేలమట్టమయ్యాయి. ఐదు పశువులు మృతి చెందాయి. విద్యుత్ స్తంభాలు, తీగలు,ట్రాన్స్ ఫార్మర్లు నేలకూలాయి. వరద నష్టం అంచనాల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. నర్సాపూర్ మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులకు ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలలో
ఆదిలాబాద్ జిల్లాలో చనఖా కొరట, సాత్నాల, మత్తడి వాగు, పెన్ గంగా వంటి ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు 50 వేల ఎకరాలు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా 35 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. సోయా, పెసర, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు, వరదనీటితో పంటలు ఎదగలేని స్థితిలో ఉన్నాయి.
మంచిర్యాల జిల్లాలో 10 వేల ఎకరాలు
జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చెన్నూర్, కోటపల్లి, జైపూర్మండలాల్లోని దాదాపు 20 గోదావరి తీర ప్రాంత గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులతో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి తెల్లవారుజామున 9.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ఆపై క్రమంగా తగ్గుతూ సాయంత్రం 6గంటలకు 6.44 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఎల్లంపల్లి 42 గేట్లను ఓపెన్ చేసి 6.94 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి రిలీజ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగులో రేఖల కౌశిక్( 11) , గ్యారే మోహన్ (40) ఇద్దరు గల్లంతు అయ్యారు.
సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్ వద్ద వార్ధా నది ఉప్పొంగి బ్రిడ్జి మీద నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో తెలంగాణ,మహారాష్ట్ర మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. భారీ వర్షానికి చింతలమనేపల్లి ఎంపీడీవో ఆఫీస్ కూలిపోయింది. వాంకిడిలోని ఖిరిడి, నవేగూడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆసిఫాబాద్ మండలంలో తుంపెల్లి వాగు ఉప్పొంగడంతో లో లెవల్ బ్రిడ్జి కోతకు గురైంది. ఆసిఫాబాద్, తిర్యాణి మండలాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి.