కేసీఆర్ సారు.. వచ్చేదెన్నడో .. చెక్కులు ఇచ్చేదెన్నడో!

కేసీఆర్ సారు.. వచ్చేదెన్నడో  .. చెక్కులు ఇచ్చేదెన్నడో!
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు లబ్ధిదారుల ఎదురుచూపు
  • గజ్వేల్ ఎమ్మెల్యే  కేసీఆర్ అందుబాటులో లేక  పంపిణీ పెండింగ్
  • ఆర్నెళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు 
  • ప్రొటోకాల్ సమస్యతో ఏం చేయలేకపోతున్న  అధికారులు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి మోక్షం కలగడంలేదు. ఆరు నెలల కిందనే చెక్కులు సిద్ధమైనా ఎవరి చేతుల మీదుగా పంపిణీ చేయాలనే దానిపై ఎటూ తేలడంలేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలకు చెందిన మొత్తం 785 చెక్కులు గజ్వేల్ ఆర్డీఓ ఆఫీసులో పెండింగ్ లో ఉన్నాయి. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండక పోవడంతో ప్రొటోకాల్ సమస్య ఎదురవుతోంది. 

గతంలో కూడా ఇలాంటి సమస్యనే ఎదురవగా చివరకు అధికారులే లబ్ధిదారులకు అందజేశారు. అదే సమస్య మరోసారి ఎదురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేస్తుంటారు. కానీ గజ్వేల్ లో అందుకు విభిన్న పరిస్థితులు ఉండడంతో అధికారులకు ఏం చేయాలో తెలియడంలేదు. ఎట్లా ముందుకెళ్లాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. 

ప్రొటో కాల్ సమస్యతో పెండింగ్

గజ్వేల్ సెగ్మెంట్ లో ప్రొటో కాల్ సమస్యతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ పెండింగ్ లో పడింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనను కాదని వేరొకరితో పంపిణీ చేయించాల్సిన పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రొటో కాల్ ఉన్న నేత లేరు.  మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజెపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎవరితో పంపిణీ చేయించినా ఇబ్బందులు తప్పవనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. దీంతో చెక్కులు పంపిణీకి నోచుకోవడంలేదు. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ చార్జ్ మంత్రి కొండా సురేఖ చెక్కులు పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా సమయం ఇవ్వకపోతుండడంతో సాధ్యపడటం లేదని తెలుస్తోంది. ప్రోటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీకి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. 

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు

 చెక్కుల కోసం లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.  ఆర్థికంగా ఆసరా అవుతాయని తమ చేతికి ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నారు.  తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులకు వెళ్లి పంపిణీపై అధికారులను అడుగుతున్నారు. చెక్కులు రెడీగా ఉండి చేతికి అందకపోవడంతో సమస్య పరిష్కారం దిశగా అధికారులు చొరవ చూపాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఆర్డీవో ఆఫీసు ముందు బీజేపీ ఆందోళన

ఆరు నెలలైనా చెక్కులు పంపిణీ చేయకపోవడంతో బీజేపీ నేతలు రెండు రోజుల కింద గజ్వేల్ ఆర్డీవో ఆఫీసు ముందు ఆందోళనకు దిగి ధర్నా చేశారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఎవరికీ అందుబాటులో లేనందున అధికారులే పంపిణీ చేయాలని కోరుతున్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో రాజకీయ పార్టీల ఆందోళనతో అధికారులే చివరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చింది.