ఉమ్మెడలో మరో శాసనం వెలుగులోకి..

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామం కాలభైరవస్వామి దేవాలయం సమీపంలో గణపతి గుండు మీద కల్యాణి చాళుక్యుల నాటి మరో శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బలగం రామ్మోహన్ గుర్తించారు.  3 అడుగుల ఎత్తు 4  అడుగుల వెడల్పుతో 20 లైన్లలో రాసి ఉంది. 

1వ జగదేకమల్లుని పాలనా కాలంలో శక సం.939,  పింగళ సం.ఆశ్వయుజ శుద్ధ షష్టి ఆదివారం(క్రీ.శ.1017 సెప్టెంబరు 29న) మండలేశ్వరుడు కొంగుణవమ్మకు మహారాజ గోపాలపురం నందగిరినాథునికి, కుమారమల్లుడికి, ప్రసన్నాచార్యులకు గురుదక్షిణగా మెట్ట భూమి, తరిభూమి దానం చేశారని పేర్కొన్నట్లు చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. శాసనమున్న రాతిగుండుపైన గోడ, కప్పు కట్టడంతో కొంత శాసనభాగం మరుగున పడిపోయినట్లు తెలిపారు. 

ALSO READ :కొమురవెల్లిలో సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

ఈ గుండు శాసనం కింద గణపతి, నాగ శిల్పం ఉన్నాయి. కుడి పక్కన రాష్ట్రకూట శైలి నాగ వీరుడి శిల్పం ఉంది. స్థానికులు ప్రతీ సోమవారం పూజలు చేస్తుంటారని తెలిసింది. ఈ గణపతి కుడివైపు తొండంతో రాష్ట్రకూటశైలిలో ఉన్నాడు. జైన గణపతి అనవచ్చని హరగోపాల్ తెలిపారు. ఈ నెల 17న  ఆ ప్రాంతంలోనే త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుని శాసనాన్ని గుర్తించిన విషయం తెలిసిందే.