మృత్యు గుంతలు .. చిన్నారుల పాలిట యమపాశాలు .. 9 మంది ప్రాణాలు బలి

మృత్యు గుంతలు .. చిన్నారుల పాలిట యమపాశాలు .. 9 మంది ప్రాణాలు బలి
  • చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు
  • మృత్యు కుహారాలుగా మారిన జేసీబీ గుంతలు
  • కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లో  9 మంది ప్రాణాలు బలి
  • మృతుల్లో ఆరుగురు 10 ఏండ్ల లోపు పసిపిల్లలే.. 

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులోని  కుంటలో మొరం కోసం  జేసీబీలతో తవ్వించగా పెద్దపెద్ద   గుంతలు ఏర్పడ్డాయి. క్యాసంపల్లి తండాకు చెందిన తేజావత్ సాయికుమార్​(16),  భూక్యా సురేశ్​(15) ఏప్రిల్ 8న స్నానం చేసేందుకు వెళ్లి గుంతలో పడి మృతి చెందగా, రెండు రోజులకు మృతదేహాలు తేలాయి.  ఆ రెండు కుటుంబాల్లో ఒడువని విషాదం నింపింది. ’'

కామారెడ్డి టౌన్​ పక్కన ఉన్న రామేశ్వర్ పల్లి కుంట సగ భాగం గుంతలతోనే ఉంది. కొద్ది పాటి నీళ్లలో చిన్నారులు ఈతకు, చేపలు పట్టేందుకు వెళ్తున్నారు.  ఫిబ్రవరి 24న గ్రీన్​ సీటీ కాలనీకి చెందిన సంతోష్​( 10),  జగన్నాథం శివ(10)  గుంత పడి మృత్యువాతపడ్డారు

కామారెడ్డి, వెలుగు : చెరువులు, కుంటల్లో మొరం కోసం ఇష్టారాజ్యంగా తవ్వగా ఏర్పడిన జేసీబీ గుంతలు మృత్యు కూపాలుగా మారాయి. చేపల వేటకు వెళ్లిన వారిని, సరదాగా ఈత కోసం వెళ్లే చిన్నారులను బలి తీసుకుంటున్నాయి.  రెండు నెలల్లోనే జేసీబీ గుంతల్లో పడి 9 మంది చనిపోగా, వీరిలో ఆరుగురు 10 ఏండ్లలోపు చిన్నారులే కావడంతో ఆ కుటుంబాలకు తీరని విషాదం మిగిలింది.  ఇటీవల కామారెడ్డి  మండలం, కామారెడ్డి టౌన్,  ఎల్లారెడ్డి, పాల్వంచ మండలాల్లో గుంతల్లో పడి చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. చెరువులు, కుంటల్లో అక్కడక్కడ ఇష్టానుసారంగా తవ్వడం వల్ల మృత్యు కుహారాలుగా గుంతలు ఏర్పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం జిల్లావాసులను కలిచివేస్తుంది. చేపల వేట, ఈత, బట్టలు ఉతికేందుకు వెళ్లేవారు గుంతల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.  

శాఖల మధ్య సమన్వయ లోపం ..

చెరువులు, కుంటలను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ చేస్తుంది. మొరం తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలి.  మైనింగ్ డిపార్ట్​మెంట్​కు ఫీజు చెల్లిస్తే పర్మిషన్ ఇస్తారు.  ఈ మూడు శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండానే  కొందరు వ్యాపారులు చెరువులు, కుంటల్లో యధేచ్ఛగా మొరం తవ్వకాలు చేస్తున్నారు.  చెరువులు, కుంటల వద్ద  హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయట్లేదు. 

ప్రమాద వివరాలు ..

కామారెడ్డి టౌన్​ పక్కన ఫిబ్రవరి 24న రామేశ్వర్​పల్లి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లిన సంతోష్​, జగన్నాథం శివలు గుంతల్లో పడి చనిపోయారు.  
మార్చి 29న ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్​కు చెందిన  పిన తల్లి మౌనిక,  10 ఏండ్ల లోపు చిన్నారులు మైథిలి, అక్షర, వినయ్ బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. పిల్లలు స్నానంచేయడానికి చెరువులోకి దిగగా, రక్షించేందుకు వెళ్లిన తల్లితో సహ నలుగురు మృత్యువాత పడ్డారు.    ఏప్రిల్ 8న  కామారెడ్డి మండలం రాఘవాపూర్ కుంటలో  స్నానం కోసం  వెళ్లిన క్యాసంపల్లి తండావాసులు  సాయికుమార్, భుక్యా సురేశ్ చనిపోయారు. ఏప్రిల్ 24న పాల్వంచ మండలం భవానిపేట కుంటలోని గుంతలో పడి రిత్విక్​(4) మృతి చెందాడు.    

సెలవుల కాలం.. చర్యలు తీసుకోండి.. 

‘పాఠశాలలకు వేసవి సెలవులొచ్చాయి. సరదాగా ఈత కోసం వెళ్తుంటారు. గుంత లోతు తెలియక ప్రాణాలమీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రుల కడుపు కోత తీర్చలేనిది. చెరువులు, కుంటల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి..’ అని జిల్లావాసులు అధికారులను కోరుతున్నారు. మొరం కోసం పెద్దపెద్ద గుంతలు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.